ప్రజాశక్తి – గురటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : రహదారులు అధ్వానంగా ఉండడంపై గుంటూరు, పల్నాడు జిల్లాల్లో టిడిపి, జనసేన శ్రేణులు శనివారం నిరసన చేపట్టాయి. గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది’ పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆర్‌టిసి బస్టాండ్ వెనుక కొల్లిశారద మార్కెట్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు నశీర్ అహ్మద్, జనసేన నాయకులు నేరెళ్ల సురేష్ మాట్లాడారు. టిడిపి నాయకులు కోవెలమూడి రవీంద్ర, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎటి అగ్రహరంలో రహదారులో నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని గాంధీనగర్ ఏనుగుపాలెం రోడ్డులో నిరసన కార్యక్రమం చేపట్టగా టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, టిడిపి, జనసేన సమన్వయ కమిటీ కన్వీనర్ నాగశ్రీను రాయల్ మాట్లాడారు. ఏనుగుపాలెం రోడ్డుతో పాటు నియోజకవర్గంలోని అనేక ఆర్ అండ్ బి, రాష్ట్ర హైవే రోడ్లు గోతులమయమై ప్రయాణం నరకయాతనగా మారిందన్నారు. ఈ రోడ్డులో కొద్దికాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా వందలాదిమంది అమాయక ప్రజలు చేతులు కాళ్లు విరిగి అంగవైకల్యానికి గురైన సంఘటనలు ఉన్నాయని చెప్పారు. మంగళగిరి పట్టణం తెనాలి ఫ్లై ఓవర్ దాటిన వెంటనే ఉన్న మంగళగిరి కృష్ణ వాటర్ పంపింగ్ హౌస్ ఎదుట జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అచ్చంపేట మెయిన్ రోడ్డు రాగి చెట్టు మీదగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తెనాలి- విజయవాడ ప్రధానరోడ్డుపై ఇరు పార్టీల శ్రేణులు బైఠాయించాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రహదారిలో నిరసన చేపట్టగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, ఇస్సపాలెం వద్ద రోడ్డుపై ఇరుపార్టీ శ్రేణుల నిరసన తెలిపారు.