విద్యార్థుల ప్రగతి కోసం సమగ్ర వార్షిక ప్రణాళిక

Nov 19,2023 00:49 #palnadu district

 

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి అభివృద్ధికి ఉపకరించే చక్కని వార్షిక ప్రణాళికలను తయారు చేయాలని పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష పథక అధికారి కె.శామ్యూల్‌ చెప్పారు. వార్షిక బడ్జెట్‌ ప్రణాళిక 2024-25 తయారీపై నరసరావుపేట పట్టణ సమీపంలోని శంకర భారతీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సమావేశంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ రానున్న ఏడాది నాటికి పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థుల ప్రగతికి అవసరమైన వార్షిక ప్రణాళికలను జాగ్రత్తగా తయారు చేయాలని సూచించారు. పిల్లలకు అతి ముఖ్యమైన వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ విద్య హక్కు చట్టానికి అనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరువగా, నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు దిశగా ప్రణాళికలు ఉండాలన్నారు. బడి బయట పిల్లలను, వికలాంగ పిల్లలను, అట్టడుగు సామాజిక తరగతులకు చెందిన పిల్లలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ప్రణాళికల కోసం పాఠశాల అభివృద్ధి కమిటీలతో చర్చించి వార్షిక బడ్జెట్‌ ప్రణాళికలను తయారు చేయాలని చెప్పారు. ఎఎస్‌ఒ పద్మారావు మాట్లాడుతూ ప్రణాళికను కచ్చితమైన సమాచారంతో రూపొందించాలన్నారు. ప్రణాళిక రూపకల్పనలో పాఠశాల, గ్రామ స్థాయి, మండల స్థాయిలో విద్యాశాఖ అనుబంధ శాఖల అధికారులను, సిబ్బందిని సంప్రదించి సహకారం తీసుకోవాలన్నారు. 20వ తేదీన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు, 22, 23 తేదీల్లో హాబిటేషన్‌ స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రణాళికలను ఆమోదింపజేసుకోవాలని చెప్పారు. 24వ తేదీన మండల విద్యాప్రణాళిక తయారు చేసి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి పంపాలని, ప్రణాళికను తయారు చేసుకోడానికి 2022-23 యు డైస్‌ డేటాను ఉపయోగించాలని సూచించారు. ఎపిఒ శంకరరాజు మాట్లాడుతూ క్రింది స్థాయి నుండి వచ్చే సమాచారం పక్కాగా ఉంటేనే జిల్లా స్థాయి ప్రణాళిక తయారు అవుతుందన్నారు. పాఠశాల విద్యా ప్రణాళికను ఎఎస్‌ఒ పద్మారావు, హాబిటేషన్‌ ప్రణాళికను ఎఎల్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ కె.శ్రీనివాసరావు, క్లస్టర్‌ స్కూల్‌ ప్రణాళికను ఎఎంఒ పి.శ్రీనివాసరావు, మండల విద్యా ప్రణాళికను తివిక్రమ్‌ వివరించారు. బాల కార్మికులను, బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సమావేశంలో సిడిపిఒ, జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️