431 మందికి కళ్యాణమస్తు, షాదీతోఫా లబ్ధి : కలెక్టర్‌

ప్రజాశక్తి – ఏలూరు
జిల్లాలో వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు / షాదీ తోఫా కింద జూలై, సెప్టెంబర్‌- 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 431 మంది లబ్ధిదారులకు రూ.3.42 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కళ్యాణమస్తు / షాదీ తోఫా ఆర్థిక సహాయాన్ని బటన్‌ నొక్కి నేరుగా వధువుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేష్‌, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, సోషల్‌ వెల్ఫేర్‌ జెడి జయప్రకాష్‌, డిఆర్‌ డిఎ పీడీ ఆర్‌.విజయరాజు, బిసి కార్పొరేషన్‌ ఇడి ఎన్‌.పుష్పాలత, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఆర్‌.నాగరాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్‌.కృపావరం, లబ్దిదారులు పాల్గొన్నారు.జిల్లాలో ఎస్‌సి కేటగిరీ (ఇంటర్‌ క్యాస్ట్‌ కింద 14 మంది) కింద 164 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 69 లక్షల 50 వేలు లబ్ధి చేకూరిందన్నారు. ఎస్‌టి కేటగిరిలో మంది 35 మందికి రూ.37 లక్షలు జమ చేశారన్నారు. బిసిలకు 211 మందికి రూ.1.13 కోట్లు, మైనారిటీ లబ్ధిదారులు 13 మందికి రూ.13 లక్షల లబ్ధి కలిగిందన్నారు. వికలాంగుల కేటగిరిలో నలుగురికి ఒక్కొక్కరికి లక్షా 50 వేల రూపాయలు చొప్పున ఆరు లక్షల రూపాయలు జమ అయ్యాయన్నారు. బిసిఒడబ్ల్యూడబ్ల్యూబి కింద నలుగురికి రూ.లక్షా 70 వేలు జమ చేశామన్నారు. ఈ సందర్భంగా పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లల చదువుకు సిఎం జగన్‌ అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు.

➡️