30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

ధాన్యం కొనుగోలు

జిల్లాలో 46 ధాన్యం, 25రాగుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ధాన్యం క్వింటా రూ.2183, రాగులుకు రూ.3846 మద్దతు ధర

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడి

ప్రజాశక్తి -పాడేరు : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లో 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్దేశించామని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్పష్టం చేసారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్‌ వ్యవసాయాధికారులతో భౌతికంగాను, రంపచోడవం, చింతూరు డివిజన్ల పరిధిలోని అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 46 ధాన్యం కోనుగోలు కేంద్రాలు, 25 రాగుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. వరికి క్వింటాకు రూ.2183 లు, రాగులకు రూ.3846 లు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 30 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం, 5 వేల మెట్రిక్‌ టన్నుల రాగులు కొనుగోలు చేయడానికి లక్ష్యం నిర్దేశించామన్నారు. వ్యవసాయాధికారులు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి కషి చేయాలని సూచించారు. లక్ష సాధనలో మండల వ్యవసాయాధికారులు చురుకైన పాత్ర పోషించాలని చెప్పారు. ధాన్యం సేకరించిన తరువాత సకాలంలో ఎఫ్‌టిఒ జనరేట్‌ చేయాలని స్పష్టం చేసారు. తేమ పన్నెండు శాతం ఉన్న ఆరుదల ధాన్యాన్ని సేకరించాలన్నారు. జిల్లాలో వరి, రాగులు ఎన్ని టన్నులు ఉత్పతి జరుగుతున్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 27వ తేదీ నుండి రాగులు కొనుగోలు చేయాలని స్పష్టం చేసారు. వరి కోతలు అనంతరం ధాన్యం సేకరణ చేయాలన్నారు. వరి, రాగులు కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో నూరు శాతం ఇ క్రాప్‌ బుకింగ్‌ చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు గోనులు, రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వర్చువల్‌ విధానంలో జాయింట్‌ కలెక్టర్‌ జె. శివ శ్రీనివాసు, రంపచోడవరం పిఒ సూరజ్‌ గనోరే, సమావేశంలో పౌర సరఫరాల శాఖ డిఎం. బి.గణేష్‌, డిఎస్‌ఒ శ్యామ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బిఎస్‌. నంద్‌, పాడేరు, చింతపల్లి వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, నేచర్‌ సంస్థ ప్రతినిధులు గౌరీ శంకర్‌, సంజీవిని దేవుళ్లు పాల్గొన్నారు.

➡️