ప్రజాశక్తి-కడప అర్బన్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని వామపక్ష రైతు, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధ వారం సిఐటియు జిల్లా కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతి రకంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వామపక్ష కార్మిక రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు కామనూరు శ్రీనివాసులురెడ్డి, లేవాకు నాగ సుబ్బారెడ్డి, దస్తగిరిరెడ్డి, మనోహర్, రాము,సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతులు, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్త ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులలోని లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ, 9 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ పేరుతో రుణమాఫీ చేసిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేయడం కాదని తెలిపారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ సంస్థలు, రైల్వే, బొగ్గు గనులు, చివరకు ఆదివాసి, గిరిజనుల అటవీ భూములపై హక్కులను హరిస్తూ తాజాగా అటవీ చట్టానికి సవరణ పాస్ చేసిందని విమర్శించారు. ఈ చర్యలన్నీ కార్పొరేట్లకు ప్రత్యేకంగా మోడీ మానస పుత్రుడు గౌతమ్ అదానీని ప్రపంచ కుబేరులలో మొదటి స్థానానికి చేర్చేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతూ, కార్పొరేట్లకు ఐటి, ఎక్సైజ్, కస్టమ్స్, కార్పొరేట్ టాక్స్‌ల పైన లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ఇస్తున్నదని పేర్కొన్నారు. మరోవైపు కార్మికుల హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందని తెలిపారు. ఫలితంగా బలహీన వర్గాల ప్రజల ఉపాధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లాభాలు పెంచి ప్రజల సంపదలు లూటీ చేస్తున్న కార్పొరేట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్ష కార్మిక, రైతు సంఘాల నాయకులు మద్దిలేటి, సుబ్రహ్మణ్యం, రవికుమార్, ఆర్.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, పాల్గొన్నారు.