27, 28న మహాధర్నా బుక్‌లెట్‌ ఆవిష్కరణ

Nov 23,2023 21:43 #27, #28 మహాధర్నా
బుక్‌లెట్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంకేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యం స్టేడియం వద్దగల ఎఐటియుసి కార్యాలయంలో నవంబర్‌ 27, 28 మహాధర్నా బుక్‌లెట్‌ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్మిక, రైతు సంఘాల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎఐటియుసి జిల్లా కన్వీనర్‌ కె.రాంబాబు, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు కె.జోజి, చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. మోడీ పరిపాలనలో 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని అన్నారు. మరోపక్క కార్పొరేట్‌ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీపై పల్లెత్తు మాట్లాడకుండా దేశప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దేశంలో ప్రతి 20 నిమిషాలకు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులు పాలైన రైతు ఆత్మహత్య జరుగుతోందన్నారు. రైతాంగ పంటలకు ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి గిట్టుబాటు ధర చట్టం చేస్తేనే రైతాంగాన్ని సంక్షోభం నుంచి కాపాడగలమన్నారు. దేశవ్యాప్తంగా నిత్యవసరాలు ధరలు ఆకాశాన్ని చేరుకుంటుంటే ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. తక్షణం నిత్యవసరాలపై జిఎస్‌టిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులు వంట గ్యాస్‌పై కేంద్రం విధించిన ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలన్నారు. కాకినాడ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో పంట సాగుబడి జరుగుతుంటే జగన్‌ ప్రభుత్వ కొనుగోలు నామమాత్రంగానే ఉందని, దీంతో జిల్లా రైతాంగం తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. బిజెపి విధానాలను తిప్పుకొట్టాలని, 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహా ధర్నాలో వేలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌.మూర్తి, వి.కొండలరావు, సోమేశ్వరరావు పాల్గొన్నారు.

 

➡️