ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : మండలంలోని అబ్బూరుకు చెందిన కౌలురైతు ఆత్మహత్యాయత్నం చేయగా సోమవారం మృతి చెందాడు. దీనిపై పోలీసుల వివరాల ప్రకారం.. అబ్బూరుకు చెందిన పల్లపు జీవరత్నం (52) నలుగురు రైతుల నుండి ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి సాగు చేపట్టాడు. పైరుకు తెగుళ్లు సోకడంతో తీవ్రంగా నష్టపోయాడు. రూ.7 లక్షల వరకూ అప్పులయ్యాయి. వీటిని తీర్చేమార్గం తోచక తీవ్ర మనస్థాపానికి గురైన జీవరత్నం ఆదివారం గ్రామంలోని సబ్‌స్టేషన్ వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఇదిలా ఉండగా జీవరత్నం సమీప గ్రామాలకు వెళ్లి ఎండు చేపలు విక్రయిస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కాగా ఏడాదిన్నర కిందట రెండో కుమారుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.