ప్రజాశక్తి-కాకినాడఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ డిసెంబర్ 11, 12 తేదీల్లో కలెక్టరేట్ దగ్గర 36 గంటల ధర్నా నిర్వహించ నున్నట్టు ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి తెలిపారు. స్థానిక సిఐటియు ఆఫీసులో నర్ల ఈశ్వరి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బేబీరాణి మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లపై పని భారాన్ని పెంచిందని, రూ.పది వేల వేతనంతో 24 గంటలూ చాకిరీ చేయిస్తున్నారని చెప్పారు. వేతనం ఇస్తున్నామనే సాకుతో సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి ఆశ వర్కర్లను దారుణంగా మోసం చేసిందన్నారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లపై తీవ్రమైన పని ఒత్తిడి పెంచి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని చెప్పారు. వర్కర్స్‌కు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు నాగలక్ష్మి, మొగలి బేబీ, జి.మంగారత్నం, వి.ఉమావతి, సత్యవతి, ఉమాదేవి, గ్రేస్ పాల్గొన్నారు.