హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత

ప్రజాశక్తి-కనిగిరి నల్సా పథకం 2015పై శనివారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కనిగిరి మండల న్యాయ సేవాధికారి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కనిగిరి కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ కె భరత్‌చంద్ర అధ్యక్షతన కనిగిరి పట్టణంలోని పవిత్ర ఫంక్షన్‌ హాల్‌లో న్యాయ సేవా శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎ భారతి పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్‌ శాఖ, గిరిజన శాఖ,అటవీ శాఖ, పురపాలక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, మెప్మా, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో గిరిజనుల దీర్ఘకాలిక సమస్యలు హక్కుల పరిరక్షణ చట్టాల పర్యవేక్షణ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని ఆమె అన్నారు. నల్సా (పిల్లల స్నేహపూరిత న్యాయ సేవలు మరియు రక్షణ) పథకం 2015 అమలులో భాగంగా అన్ని విద్యాలయాలలో విద్యార్థులకు లీగల్‌ ఎయిడ్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి బాలల హక్కులు వారి రక్షణ కొరకు ఉన్న చట్టాలపై ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వ్యవస్థలపై అవగాహన కలిగించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్యామ్‌ బాబు మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థల సేవలు గురించి వివరించారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోయినా ఎలాంటి సేవలకైనా న్యాయ సేవాధికార సంస్థకు అర్జీ పెట్టుకొనిన ఎడల వారికి సత్వరమే న్యాయం చేస్తామని నల్సా పథకాలు, సేవలపై అవగాహన కలిగించారు. ఎక్సైజ్‌ కోర్టు స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి వెంకట స్వామి శర్మ మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, ఫోక్సో చట్టం 2012పై అవగాహన కలిగించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పాశం పిచ్చయ్య, మున్సిపాలిటీ చైర్మన్‌, న్యాయవాది షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ గిరిజనుల చట్టాలపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ శాఖల అధికారులు ఆయా శాఖల సేవలు గురించి వివరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు సాంస్కతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గిరిజనులకు ఆయుష్మాన్‌ ఆధ్వర్యంలో భారత్‌ హెల్త్‌ కార్డ్స్‌, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు చేతి కర్రలు, మదర్‌ థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాన్‌ ఇర్విన్‌, మున్సిపాలిటీ కమిషనర్‌ నారాయణరావు, కనిగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శివరామకృష్ణారెడ్డి, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్‌ సిబ్బంది, కోర్టు సిబ్బంది, పారా లీగల్‌ వాలంటీర్లు జిల్లా మండల న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు బాలలు తదితరులు పాల్గొన్నారు.

➡️