స్వపక్షంలో విపక్షం

Nov 29,2023 21:41

ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్‌   :   ఓ వైపు అజెండాలోని అంశాలను మున్సిపల్‌ ఉద్యోగి చదవడం ప్రారంభించారు. తొలి అంశం పూర్తికాకముందే, ప్రతిపక్ష కౌన్సిలర్లు అడ్డుతగలడం, సమావేశాల్లో ఎన్నిసార్లు సమస్యలు లేవనెత్తినా పరిష్కారం కావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేయడం, వాకౌట్‌ చేయడం జరిగిపోయాయి. మిగతా అంశాలను చదువుతుండగానే.. అధికార పార్టీ సభ్యులు బల్లగుద్ది మరీ ఆమోదం తెలపడం.. వెంటనే బయటకెళ్లిపోవడం ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభించి, గంట కూడా కాలేదు.., ఇంతలో సమావేశమందిరం ఖాళీ అవుతుండటంతో ఆశ్చర్యపోవడం చైర్‌పర్సన్‌ వంతైంది. ఆమె తేరుకుని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా, అధికార పార్టీ సభ్యుల నుంచే నిలదీతలు, అసహనాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటికి బుధవారం జరిగిన మున్సిపల్‌ సాధారణ సమావేశం వేదికైంది.మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం ఏర్పాటుచేశారు. మున్సిపల్‌ ఉద్యోగి అజెండాలో పొందుపరిచిన 29 అంశాలను చదవడం ప్రారంభించారు. తొలుత పాత బస్టాండ్‌ కూడలి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు డివైడర్‌ను రూ.4.98 లక్షలతో అభివృద్ధి చేసేందుకు కౌన్సిల్‌ ఆమోదం కోసం తెలియజేయగా, టిడిపి కౌన్సిలర్లు అడ్డుతగిలారు. టిడిపి కౌన్సిలర్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ డివైడర్‌పై ఉన్న మొక్కల వల్ల ఎవరికీ ఇబ్బంది లేదన్నారు. కనీసం స్వపక్ష, విపక్ష కౌన్సిల్‌ సభ్యులతో చర్చించకుండా, కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే ఆదరాబాదరాగా డివైడర్‌పై ఉన్న మొక్కలను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించారు. వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయని, ఆ నిధులతో సమస్యలు పరిష్కరించవచ్చని సూచించారు. బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చాలా సమావేశాల నుంచి చెబుతున్నా వాటిని ఇప్పటికీ ఏర్పాటు చేయడం లేదని 8వ వార్డు టిడిపి కౌన్సిలర్‌ కోరాడ నారాయణరావు నిలదీశారు. అనంతరం సమావేశాల వల్ల ఉపయోగం ఉండటం లేదని టిడిపి కౌన్సిల్‌ సభ్యులు వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు.అనంతరం ఎజెండాలోని అంశాలను చదివి వినిపిస్తుండగా, అన్ని అంశాలకూ తమకు అభ్యంతరం లేదని అధికార పార్టీ సభ్యులు ఆమోదం తెలిపి, చాలామంది సమావేశం నుంచి వెనుదిరిగారు. ఈ హఠాత్‌ పరిణామానికి చైర్‌పర్సన్‌ ఆశ్చర్యానికి గురై బెల్‌ కొట్టకుండానే, టేబుల్‌ అజెండాను ఆమోదించకుండానే సమావేశం నుండి బయటకు వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. సభలో చాలామంది సీనియర్‌ సభ్యులు ఉన్నారని, ఈ విషయం తెలియకపోవడం ఏమిటని అసహనం వ్యక్తంచేశారు. నెలకోసారి సమావేశానికి వచ్చిన అధికారపక్ష కౌన్సిలర్లు గంటసేపు సమావేశ మందిరంలో ఉండలేకపోవడం చాలా బాధాకరమన్నారు. దీంతో కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఈ రెండున్నర ఏళ్లు తమకు అవమానాలే ఎక్కువగా జరిగాయని అసంతృప్తి వెల్లగక్కారు. డివైడర్‌పై మొక్కలను నాటినప్పుడు తమను పిలవకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా మొక్కుబడిగా కార్యక్రమం చేపట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు తెలియకుండానే, భాగస్వామ్యం చేయకుండానే చాలా సందర్భాలలో మీతోపాటు మున్సిపల్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గున్నేష్‌, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామ అప్పలనాయుడు, డిఇ కిరణ్‌ కుమార్‌, ఆర్‌ఒ రూబెన్‌ దిబ్బా, ఎఇ ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️