ప్రజాశక్తి – జగ్గంపేట రూరల్
సచివాలయం నిర్మాణానికి అవసరమైన సిమ్మెంట్‌ను కొనుగోలు చేసేందుకు డ్రా చేసిన సొమ్మును తిరిగి రికవరీ చేస్తామని ఉపాధి హామీ పథకం పిడి అడపా వెంకటలక్ష్మి తెలిపారు. జగ్గంపేట మండలంలో 2022- 23 సంవత్సరంలో జరిగిన ఉపాథి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం స్థానిక ఎంపిపి కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పిఆర్ ద్వారా మండలంలోని నరేంద్రపట్నం సచివాలయం భవన నిర్మాణానికి రూ.2.42 లక్షల విలువ చేసే సిమ్మెంట్‌ను డ్రా చేశారని, అయితే అక్కడ సంబంధిత భవనం నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. ఆ సొమ్మును సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేస్తామన్నారు. సోషల్ ఆడిట్ సిబ్బంది గ్రామాల్లో జరిగిన పనులను పరిశీలించి, గుర్తించిన అవకతవకల విషయాలను ప్రజావేధిక దృష్టికి తీఉకొచ్చినట్లు తెలిపారు. గత 15 రోజులుగా సోషల్ ఆడిట్ సిబ్బంది గ్రామాల్లో తనిఖీలు నిర్వహిం చారన్నారు. వర్షాలు లేకపోవడంతో ఉపాధి హామీ ద్వారా నాటిన మొక్కలు చాలా పాడవడం జరిగిందన్నారు. వాటి స్థానంలో మొక్కలు నాటి సదుపాయం కల్పించాలని పంచాయితీ కార్యదర్శులను ఆదేశాలు జారీ చేశామన్నారు. కొన్ని గ్రామాల్లో మేట్లు పని దినాలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో కూలీలకు వేతనాలు పడలేదని గుర్తించామన్నారు. ఈ పనుల్లో రూ.74,662లను రికవరికీ ఆదేశించామన్నారు. ఈ ఏడాది మొక్కలు పెంపకంపైనే దృష్టి సారించడం జరిగిందని అమె తెలిపారు. ఈ సమావేశంలో అంబుడ్స్‌మెన్ జ్యోతి, ఎంపిడిఒ వసంత్ కుమార్ పాల్గొన్నారు.