రోడ్డుకు ఇరువైపులా ఏళ్ల తరబడి తిష్ట
వర్షపు నీరు మళ్లే వీలులేక రహదారి ఛిద్రం
పట్టించుకోని ఎస్‌ఇబి, ఎక్సైజ్ అధికారులు
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ : నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు వెంబడి ఇరువైపులా గంజాయి, సారాతో పట్టుబడ్డ వాహనాలను ఏళ్లతరబడి అలాగే వదిలేయడంతో సమస్యలు వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌్‌మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్ అంద్ ఎక్సైజ్ శాఖ పట్టుకుని సీజ్ చేసిన వ్యానులు, కారులు, ఆటోలు, ఇతర వాహనాలను నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంచడంతో వాటిల్లో తుప్పలు, డొంకలు పెరిగిపోయాయి. అంతేకాక దిక్కుమొక్కూ లేకుండా వీటిని అలాగే వదిలేయడంతో రోడ్డు అంచుల్లో ఇరువైపులా మట్టి దిబ్బలు పేరుకుపోయి ఏపుగా పిచ్చిమొక్కలు పెరిగి, రోడ్డు కాస్తా ఇరుకుగా మారింది. అంతేకాక వర్షం కురిస్తే, రోడ్డు అంచుల్లో ఉన్న ఈ వాహనాల వల్ల నీరు రోడ్డు పక్కలకు మళ్లిపోయే వీలులేక రోడ్డుపైనే నిలిచిపోవడంతో తారురోడ్డు శిథిలమై నిండా గోతులమయంగా మారి పూర్తిగారూపుకోల్పోయిందని వాహనదారులతోపాటు ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు ఎటుపోకుండా రోడ్డుపైనే ఉండిపోవడంతో తారురోడ్డు దెబ్బతిని మెటల్ లేచిపోయి, పెద్దగోతులతోపాటు, రోడ్డుపైన ఇరువైపులా మెటల్, మట్టి దిబ్బలుగా ఏర్పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారిందని పలువురుల అంటున్నారు. అసలే ఏళ్ల తరబడి నిర్వహణ, పునర్నిర్మాణం లేక, అధ్వానంగా తయారైన రోడ్డుకు, ఇక్కడ రోడ్డుపక్కన ఉంచిన సీజ్ చేసిన వాహనాలతో మరింత కష్టాలు పెరిగాయని ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి సరుకులు రవాణా చేసే లారీలు వంటి భారీ వాహనాలతోపాటు బస్సులు, ఇతర వాహనాలు ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. గంజాయి, సారాయి కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పలుచోట్ల వేలం వేసి, క్లియర్ చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ, నర్సీపట్నంలో ఎందుకనో ఏళ్లతరబడి అలాగే వదిలేశారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి, రోడ్డు రక్షణ, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రోడ్డు అంచుల్లోనే నిలిపేసిన సీజ్ వాహనాలను క్లియర్ చేయించాలని పలువురు కోరుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా పట్టుబడ్డ వాహనాలు