ప్రజాశక్తి-మార్కాపురం రూరల్ : మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశం కేలవం గంటన్నరలోపే సాదాసీదాగా ముగిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మార్కాపురంలో అభివద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో మరింత అభివద్ధి చేసుకొని కౌన్సిల్‌కు మంచి పేరు వచ్చేలా పని చేద్దామన్నారు. 33వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ మాట్లాడుతూ రాజ్యలక్ష్మి కాలనీలో పొరంబోకు స్థలంలో అనేక సంవత్సరాల నుంచి గుడిసె ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న వ్యక్తి ఇటీవల గుడిసెను తొలగించి స్లాబ్ వేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే టౌన్‌ప్లానింగ్ సెక్రటరీ ప్లాన్ తీసుకోవాలని లేకపోతే నిర్మాణం ఆపేయాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో చైర్మన్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఆక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించవద్దన్నారు. అర్హులకు జగనన్న లేఅవుట్‌లో నివాస స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. 8వ వార్డు కౌన్సిలర్ దొడ్డ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో పూర్తి స్థాయిలో సాగర్ పైప్ లైన్ లేకపోవడంతో ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య గురించి 27 నెలలుగా కౌన్సిల్ దృష్టి తీసు కొస్తున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో చైర్మన్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ సాగర్ పైపు లైన్ నిర్మాణం కోసం ఈ పాటికే రూ.10 లక్ష నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అంజమ్మ, కమిషనర్ బిఎస్.గిరికుమార్, కో ఆప్షన్ నెంబర్లు పి.అమీరుల్లాఖాన్, గుంటక వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.