సమ్మెకు సై…

అంగన్‌వాడీలు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించని సర్కారు తీరుకి నిరసనగా అంగన్‌వాడీలు మరోసారి పోరాటానికి సిద్ధపడుతున్నారు. వచ్చే నెల 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఇందుకు సంబంధించిన దానిపై ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అధికారులకు నోటీసులు అందచేశారు. కాకినాడ జిల్లాలో 9 ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1927 మెయిన్‌, 59 మినీ మొత్తంగా 1986 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 3972 మంది పని చేస్తున్నారు. వీటి పరిధిలో 13,134 మంది గర్భిణీలు, 11,518 మంది బాలింతలు, 62,170 మంది 6 నుంచి 36 నెలలు గల చిన్నారులు, 29,728 మంది 36 నుంచి 76 నెలలు గల పిల్లలు ఉన్నారు. కీలకమైన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు క్షేత్రస్థాయిలో విశేష సేవలందిస్తున్నారు. ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నా, కనీస వేతనాలు ఇవ్వకపోయినా, సకాలంలో బిల్లులు చెల్లించకపోయినా, కేంద్రాల అద్దెలు పెండింగ్లో ఉంచుతున్నా, ప్రభుత్వ సౌకర్యాలు అందకపోయినా అంకితాభావంతో పనిచేస్తున్నారు. అయినా ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరంచడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాడ్యుటి ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ల అద్దెలు, టిఎ బిల్లులు తక్షణం చెల్లించాలని, ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు చెల్లించి, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని ఇలా అనేక సమస్యలపై గత ప్రభుత్వ హయాం నుంచి వివిధ రూపాల్లో అనేక సందర్భాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లుగా వివిధ రూపాల్లో పోరాటాలను చేస్తున్నారు. అయినా వైసిపి ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదు. తెలంగాణలో రూ.13,650 చెల్లిస్తుంటే, అదనంగా చెల్లిస్తానని పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ హామీని పట్టించుకోలేదు. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.11,500, ఆయాలకు రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇలా చాలీచాలని వేతనాలు ఇస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ సంక్షేమ పథకాలకు కోత విధిస్తోంది. వివిధ రకాల యాప్‌ల పేరుతో పని భారాన్ని పెంచి తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ సంక్షేమ పథకాలను కత్తిరిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసిన ఒక్కరికి కూడా ఎటువంటి బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదు. పింఛను సౌకర్యం కూడా కల్పించడం లేదు. ఇలా అనేక దీర్ఘకాలిక సమస్యలతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కొట్టుమిట్టాడుతున్నారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు గత నాలుగు నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో యజమానుల నుంచి కార్యకర్తలు ఒత్తిడికి లోనవుతున్నారు. కూరగాయల బిల్లులు నెలలు తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. గ్యాస్‌ ధర పెరగడంతో కార్యకర్తలకు భారంగా మారింది. కేంద్రాల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, పప్పులు, నూనెలు ఇతర వస్తువులను సొంత ఖర్చులతోనే కేంద్రాలకు తీసుకొచ్చుకుంటున్నారు. గత రెండేళ్లుగా టిఎ, డిఎ బిల్లులు ఇవ్వడం లేదు. దాంతో సొంత ఖర్చులతో అప్పులు చేసి విధుల్లో పాల్గొంటున్నారు. ఇలా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️