సమస్యల సుడిలో గురుకుల పాఠశాల

గురుకుల పాఠశాల

ప్రజాశక్తి-రామచంద్రపురంపేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం రూ.15.కోట్ల రూపాయలతో నిర్మించిన గురుకుల పాఠశాలలో పలు సమస్యలతో సతమతమవుతోంది. మూడేళ్లుగా సమస్యలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామ పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారపుపేట సమీపంలో గురుకుల పాఠశాల నిర్మించింది. ఈ పాఠశాలలో సుమారు 400 మంది 6 నుండి 10 తరగతిలో విద్యార్థులు చదువుతుండగా 120 మంది జూనియర్‌ కాలేజీ విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు తాగునీటి సౌకర్యానికి నాడు-నేడు అభివద్ధి పనుల్లో భాగంగా రెండు ఆర్‌ఒ ప్లాంట్లు మంజూరు చేశారు. వీటి ద్వారా విద్యార్థులకు రక్షిత మంచినీరు లభిస్తుందని ఆశించిన రెండేళ్లుగా పనులు ప్రారంభం కాలేదు. ఎక్కడ లభించే గ్రౌండ్‌ వాటర్‌నే విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. మొత్తం 529 మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్‌ కూడా లేకపోవడంతో ఇక్కడ మట్టిలో తుప్పల్లో, మొక్కల మధ్య విద్యార్థులు ఆటలు కొనసాగిస్తున్నారు. హాస్టల్‌ బయట రెండేళ్లుగా ఒక్క విద్యుత్‌ దీపం కూడా లేకపోవడంతో హాస్టల్‌ అంతా చిమ్మ చీకటిగా ఉండి రాత్రి సమయంలో విద్యార్థులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. హాస్టల్లోని టాయిలెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి చాలీ చాలని సిబ్బంది వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. కొన్నింటికి డోర్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. మూడేళ్లుగా విద్యార్థులకు సబ్బులు, షాంపూలు కొనుక్కునేందుకు ప్రభుత్వం చెల్లించే కాస్మొటిక్‌ ఛార్జీలు ప్రభుత్వం నిలిపివేయడంతో జుట్టు కత్తిరించుకునేందుకు సైతం విద్యార్థులు డబ్బులు చెల్లించవలసి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌తోనే పాలనద్రాక్షారామం గురుకుల పాఠశాలకు ప్రిన్సిపల్‌ లేకపోవడంతో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా ఎన్‌వి.నాగేశ్వరరావును రెండు నెలలుగా ఆయన కూడా అనారోగ్యానికి గురై మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. దీంతో మరో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా శంకర్‌ను నియమించారు. ఎక్కడ పూర్తిస్థాయి బాధ్యతలతో ప్రిన్సిపల్‌ను నియమించాల్సి ఉంది.పేరెంట్స్‌కు తప్పని తిప్పలుగురుకుల పాఠశాలలో విద్యార్థులను కలుసుకునేందుకు వస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు ఇక్కడ ఇక్కట్లు తప్పడం లేదు. పేరెంట్స్‌ వచ్చినప్పుడు బయడే ఎండలో ఎంతసేపు నిలబడాలో అర్థం కాని పరిస్థితి. విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చేటప్పుడు విద్యార్థులను కలుసుకునేందుకు ఒక షెడ్డు ఏర్పాటు చేయాలని కనీసం కూర్చునేందుకు అవకాశం కల్పించాలని, విద్యార్థులకు ప్లే గ్రౌండ్‌ ఏర్పాటు చేయాలని, పాఠశాల బయట గ్రౌండ్లో విద్యుత్‌ దీపాలు వెలిగేలా చర్యలు చేపట్టాలని, టాయిలెట్లు రిపేర్లు చేయించాలని, టాయిలెట్లు వద్ద సరిపడా సిబ్బంది నియమించాలని, విద్యార్థులకు రక్షిత మంచినీరు సౌకర్యాన్ని కల్పించాలని, కాస్మొటిక్‌ ఛార్జీలు చెల్లించాలని, ప్రతివారం చర్మ వ్యాధుల వైద్యులు, కంటి వైద్యులు విద్యార్థులను పరీక్షించేందుకు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️