సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..

Nov 28,2023 23:42
అభిమానుల మధ్య

ప్రజాశక్తి -అమలాపురం, అమలాపురం రూరల్‌, ముమ్మిడివరం

సమస్యలు వింటూ, వినతులు స్వీకరిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యాత్ర మంగళవారం సాగింది. అమలాపురం మండలం పేరూరు క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభమైన యాత్ర అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో సాగింది. యాత్రలో సమావేశాలు, వివిధ సామాజిక వర్గాలు, యువతతో ముఖాముఖి వంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. తొలుత పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద జిల్లా ఆక్వా రైతులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా రంగం కుదేలవ్వడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమలాపురం క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో బండారులంక చేనేత కార్మికులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. చేనేత వస్త్రాల అమ్మకాలపై 30శాతం రిబేటు ఇవ్వట్లేదన్నారు. ఆరోగ్యబీమా పథకాలను ఎత్తేశారన్నారు. దీనిపై లోకేష్‌ స్పందించారు. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను కనీసం పరామర్శించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకపోయందని విమర్శించారు. టిడిపి అధికారంలోకొచ్చాక చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని రద్దు చేస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. అలాగే వికలాంగలు పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. అమలాపురం హైస్కూల్‌ సెంటర్‌లో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. బిసిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని లోకేష్‌ వారికి తెలిపారు. అమలాపురం భట్నవిల్లిలో పివి.రావు మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. దళితులపై జరుగుతున్న దాడులను, రద్దయిన సంక్షేమ పథకాల వల్ల కలుగుతున్న నష్టాన్ని ఆయనకు వివరించారు. ఎస్‌సి వర్గీకరణకు మద్దతు ఇవ్వరాదని కోరారు. లోకేష్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ దళితులకు దక్కాల్సిన రూ.28,147 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లించి అన్యాయం చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే రద్దుచేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్‌ తెలిపారు. భట్నవిల్లిలో యువతతో ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత పవర్‌ ఏంటో మొదటి సారి ఓటర్లుగా జగన్‌కి చూపించాలని కోరారు. వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రారభిస్తామన్నారు. యువత రాజకీయాల్లోకి రావాన్నారు. ప్రతి ఏడాదీ పద్ధతి ప్రకారం అన్ని ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకూ సిలబస్‌ను ప్రక్షాళన చేస్తామన్నారు. రాష్ట్రాన్ని వైసిపి సర్కారు గంజాయిమయం చేసిందన్నారు. ఏ పంటకీ లేని ధర గంజాయికి ఉందన్నారు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి లేకుండా చేస్తాన్నారు. జగన్‌ పాలన ముగిసే సరికి ఎపి అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. అమర్‌ రాజా లాంటి అనేక కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. గ్రూప్‌- 1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల భర్తీ లేనేలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియథెరపీ పోస్టులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఎంపిలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు. యువత గమనించి టిడిపి, జనసేన కూటమికి పట్టం కట్టాలని కోరారు. ఆయన వెంట టిడిపి నాయకులు హరీష్‌ మాథూర్‌, అయితాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు తదితరులు ఉన్నారు.

➡️