ప్రజాశక్తి-కొయ్యూరు
అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేష్ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ మండలంలోని 33 పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. గిరిజనులకు అవసరాల సమయంలో పిహెచ్‌సి నుంచి అంబులెన్స్‌ను ఇచ్చేందుకు రకరకాలు ఇబ్బందులు పెడుతున్నారని, ప్రజా ప్రతినిధులు వెళ్లినా మీకు సంబంధం ఏమిటంటే ప్రశ్నిస్తున్నారని సర్పంచ్‌లు తెలియజేయగా, సరి చేసుకుంటామని వైద్యశాఖ అధికారులు చెప్పారు. కంఠవరం పిహెచ్సిలో సిహెచ్‌డబ్ల్యులు, ఆశాలతో నైట్ డ్యూటీలు చేయించడంపై ఎంపీపీ మండిపడ్డారు. ఇకనుంచి అలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఏ కార్యక్రమాలు చేసిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు తెలియజేయడం లేదని సర్వనాపాలెం ఎంపీటీసీ గాంధీ ఆరోపించారు. ఈ విషయమై కొంతసేపు సమావేశం రసాభాసగా మారింది. మండలంలోని ఆశ్రమం పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆరోపించారు. ఎటిడబ్ల్యుఒ, అగ్రికల్చర్ ఏవో, ఐసిడిఎస్ అధికారి సమావేశానికి హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామరాజుపాలెంలో మంచినీటికి ఇబ్బంది పడుతున్నట్లు సర్పంచ్ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు ఇవ్వడం లేదని, కుళ్ళిన గుడ్లు పంపిణీ అవుతున్నా పట్టించుకోవట్లేదని ఐసిడిఎస్ పిఓపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.అంగన్వాడీలు, ఆశాల సమస్యలపై వినతి కొయ్యూరు : మండలంలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీకి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై.అప్పలనాయుడు ఆధ్వర్యాన బుధవారం వినత పత్రం అందించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని, పెంచిన పనిభారాన్ని తగ్గించాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అంగన్వాడీలు ఎల్ ముత్యాలమ్మ, చి అచ్చియమ్మ, పూర్ణ, ఎం వెంకటలక్ష్మి, బంగారమ్మ, రాజేశ్వరి, అమ్మాజీ, వెంకట రమణ, రత్నం, కళ, పి.సత్య వేణి, డి.వెంకట రమణమ్మ, ఎస్.రమణమ్మ, ఎం దేవుడమ్మ, భారతి, అమ్మాజీ, జీవనజ్యోతి, గిరిజన సంఘం నాయకులు ఎస్. సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.