ప్రజాశక్తి-మండపేటప్రముఖ సంఘ సేవకులు, వైద్యురాలు డాక్టర్ పాలడుగు సత్యవతి కుటుంబాన్ని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు పేద ప్రజలకు చంద్రమౌళి సత్యవతి దంపతులు వైద్య సేవలు అందించడంతోపాటు సమాజసేవ చేసి ఆదర్శవంతమైన జీవితం గడిపారన్నారు. నేటి ఆధునిక సమాజంలో వైద్యం ఖరీదైపోయిందని పెద్ద పెద్ద ఆసుపత్రులు నగరాల్లో ఏర్పాటు చేస్తున్నప్పటికీ సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం విఫలమైన నేటి సమాజంలో ఇటువంటి చిన్న చిన్న ఆస్పత్రులు నిర్వహించే వైద్యులను సమాజం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శరీరంలో ప్రతి అవయవానికో డాక్టర్ ఉన్న నేటి సమాజంలో సంపూర్ణంగా వైద్యం అందించే వైద్యులు కరువయ్యారన్నారు. ఈ దంపతుల జీవితాన్ని యువత స్ఫూర్తి పొందాలన్నారు. కుల, మత, రాజకీయాలను పక్కనపెట్టి సమాజ సేవకు కృషి చేయాలన్నారు. తొలుత సత్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆయన వెంట రెడ్ క్రాస్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ వైడి.రామారావు, ఇనపకోళ్ల శ్రీహరి, వెంకటేశ్వరరావు, విజ్ఞాన్ గణేష్, దాసరి తిరుమలరావు తదితరులు ఉన్నారు.