ప్రజాశక్తి-గుంటూరు : ఖరీఫ్ సీజన్‌లో సాగైన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే ప్రక్రియ సజావుగా కొనసాగేలా పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయశాఖ, సహకార మార్కెటింగ్ సొసైటీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పటిష్ట ప్రణాళికా ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన శిక్షణలో జెసి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో లక్షా 38 వేల 635 ఎకరాల్లో వరి సాగు చేశారని, సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ధాన్యం 75 కిలోల బస్తాకు కామన్ రకానికి రూ.1637.25లు, గ్రేడ్ ‘ఎ’ కు రూ.1652.25లు మద్దతు ధర ప్రకటించిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున డిసెంబరు మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, ఇప్పటికే అన్ని ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేశామని చెప్పారు. 163 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఖరీఫ్‌లో వరి సాగు చేస్తున్నట్లు గుర్తించి, వీటిని 65 క్లస్టర్లుకు మ్యాపింగ్ చేశామని తెలిపారు. ధాన్యాన్ని కళ్లం వద్ద నుంచే కొనుగోలు చేసి ఆర్‌బికెల వద్ద రైతుకు ఎఫ్‌పీఓ అందించి, ధాన్యంను మిల్లుకు తరలిస్తారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే తక్కువుకు బహిరంగ మార్కెట్లలో రైతులు ధాన్యంను అమ్ముకోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ- క్రాప్‌లో నమోదైన వివరాల ప్రకారం రైతు పొలం వద్దే వ్యవసాయ సహయకులు ధాన్యం కొనుగోలు షెడ్యూల్ కూపన్‌ను రైతుకు అందిస్తారని, దాని ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ ధాన్యం శాంపిల్స్ సేకరించి, ఎఫ్‌ఏక్యూ పరీక్షలు నిర్వహించి యాప్‌లో నమోదు చేస్తారని వివరించారు. కార్యక్రమంలో తెనాలి సబ్‌కలెక్టర్ గీతాంజలి శర్మ, డిప్యూటీ కలెక్టర్ స్వాతి, గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి పి.శ్రీఖర్, డిఎఒ ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు జి.లక్ష్మీ, జిల్లా పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ పాల్గొన్నారు.