సంక్షేమ ప్రభుత్వానికి తిరుగులేదు

Nov 29,2023 22:16 #సంక్షేమ
రాంబాబు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంప్రజా సంక్షేమ పాలనకు తిరుగులేదని, ఎవరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపియేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం కాపవరంలో తురిగడ్డ రివర్స్‌ పంపింగ్‌ స్కీమ్‌ అభివద్ధి పనులకు, చిన్న నీటి పారుదల అభివద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 1,510 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉంఉలఖు జక్కంపూడి రాజాతో కలిసి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. తురిగడ్డ ఎత్తిపోతల పథకం మిగతా ఎత్తిపోతల పథకం కంటే చాలా భిన్నంగా ఉంటుందన్నారు. ఇక్కడ వరద నీటిని ఎత్తిపోతల పథకం నుంచి గోదావరిలోకి పంపింగ్‌ చేస్తారన్నారు. ఎన్నో దశాబ్ధాల నుండి రైతులు పడుతున్న కష్టాలను చూసిన స్థానిక ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా పలుమార్లు సిఎం జగన్మోహన్‌ దృష్టికి ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకున్నారన్నారు. నియోజకవర్గంలోని రైతాంగానికి ఊరట కలిగించే విధంగా రూ.38 కోట్లతో చిన్న నీటి పారుదల అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఎవరు ఎంత మంది కలిసి వచ్చినా అంతిమ విజయం వైసిపిదేనని, మళ్లీ వైఎస్‌.జగన్‌ సిఎం అవుతారని చెప్పారు. అనంతరం జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడా గురుదత్త ప్రసాద్‌, జక్కంపూడి గణేష్‌ పాల్గొన్నారు.

➡️