ప్రజాశక్తి-సాలూరు : శాంతి భద్రతల రక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర తెలిపారు. పట్టణంలోని మక్కువ రోడ్డులో రూ.2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన రూరల్ పోలీసు స్టేషను భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు పనిచేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూరల్ పోలీసు స్టేషను నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అన్ని సదుపాయాలతో ఎపి స్టేట్ పోలీసు హౌసింగు కార్పొరేషను వారితో రూ.2.50 కోట్లతో పోలీసు స్టేషను నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధికి రోడ్ల నిర్మాణం చాలా అవసరమని, దానికి రోడ్లు, భవనాల శాఖతో పాటు పోలీసు శాఖ సహకారం కూడా చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, కలెక్టరు నిశాంత్‌కుమార్, డిఐజి ఎస్.హరికష్ణ, ఎస్‌పి విక్రాంత్ పాటిల్, దిశ డిఎస్‌పి హర్షిత, డిఎస్‌పి శేషాద్రి, పోలీసు హౌసింగు కార్పొరేషను ఇఇ కె.తమ్మిరెడ్డి, డిఇ వి.వెంకటరెడ్డి, సిఐ ఎస్.ధనుంజయరావు, స్టేషను ఇన్‌ఛార్జి మురళి, ఎస్.ఐ. ప్రయోగరావు, సిబ్బంది పాల్గొన్నారు.