వ్యాపారులదే రాజ్యం

ప్రజాశక్తి- సింహాద్రిపురం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మంచి ధరలు వస్తాయని ఆశించిన నేపథ్యంలో మార్కెట్‌లో మాయాజాలం కారణంగా చీని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా పులివెందుల నియోజవర్గంలోనే చీనీ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా సింహాద్రిపురం, తొండూరు, లింగాల మండలాలలో దాదాపు 35 వేల ఎకరాలలో తోటలు సాగులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పండే చీనీ కాయలు అధిక రోజులు నిల్వ ఉండడంతో పాటు కాయలు నాణ్యత సైతం బాగా ఉంటాయి. దీంతో కడప జిల్లా ప్రాంతంలోని చీనీ కాయలకు బెంగళూరు, శివమొగ్గ, చెన్నై, కోయంబత్తూర్‌, విజయవాడ ఇతర రాష్ట్రాలలోని మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. స్థానికంగా ఉండే చీనీ తోటల వద్దనే వ్యాపారులు కొనుగోలు చేసి బెంగళూరు, చెన్నై లాంటి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుంటారు.రైతులపై వ్యాపారస్తులదే పైచేయి… చీనీ రైతులు తమ పంట ఉత్పత్తులను పండించినప్పటికీ వాటిని విక్రయించాలంటే వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో పులివెందులలో చీనీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. వ్యాపారులు మాత్రం స్థానికంగా ఉండే వారు మాత్రమే ఇక్కడ మండీలు ఏర్పాటుచేసి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా స్థానిక వ్యాపారులు కొనుగోలు చేయడంతో మంచి ధరలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రముఖ కంపెనీలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.దసరా తర్వాత పెరిగిన ధరలు దసరా పండుగ అనంతరం చీనీ ధరలు అమాంతంగా రూ 33 వేల నుంచి రూ 55 వేల వరకు పెరిగాయి. అయితే ఈ విధంగా ధరలు పెరగడంతో రైతులు ఒక దశలో సంతోషం వ్యక్తం చేశారు. మరింత ధరలు పెరు గుతాయని అనుకుంటున్న నేప థ్యంలో వ్యాపారులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడినుంచి కాయలు కొనుగోలు చేసి బెంగళూరు మార్కెట్‌కు తరలిం చారు. దీంతో ధరలు పెరగకుండా వ్యాపారులే కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ 65 వేల నుంచి రూ 75వేల పలికిన చీని కాయలు ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 55 వేల లోపు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పులివెందుల మార్కెట్‌లో మాత్రం మూడు రోజుల నుంచి టన్నుకు 20 కిలోల తరుగు, 8 శాతం కమీ షన్‌తో రూ 40వేల లోపు మాత్రమే వ్యాపారులు కొను గోలు చేస్తున్నారు. సీజన్‌ కాయలకు కాలం ముగిస్తు న్నప్పటికీ ధరలు రాకపోవడంతో తీవ్రంగా నష్టపో తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నేల రాలుతున్న కాయలు .. మంచి ధరలు ఆశించి నిలువ చేసిన రైతులకు నష్టం వాటిల్లుతోంది. కాయలకు కొమ్మ తెగులు రావడంతో చెట్టు పైన ఎండిపోయి రాలిపోతున్నాయి. దీంతో ఎకరాకు రెండు టన్నులు చొప్పున నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు.ధరలు వస్తాయని ఆశించా.. మార్కెట్‌లో ఈ ఏడాది మంచి ధరలు వస్తాయని ఆశించి కాయలు నిల్వ చేశా. అయితే ధరలు మాత్రం టన్నుకు రూ.50 నుంచి రూ.55 వేల వరకు మాత్రమే ధరలు స్థానిక తోటల వద్ద వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు పెరగలేదు.- మధుసూదన్‌రెడ్డి, రైతు, గురజాల.ధర కోసం వేచి చూసినా.. ఈ ఏడాది ధర కోసం వేచి చూసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ధరలు పెరుగుతాయని ఆశించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. కాయలు నిలువ చేసుకోవడానికి కోల్డ్‌ స్టోరేజ్‌ లాంటివి ఏర్పాటు చేయాలి. -మురళి మోహన్‌, రైతు , గురజాల

➡️