ప్రజాశక్తి – కడియం
వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు అష్టకష్టాలే ఎదురయ్యాయని ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌లు అన్నారు. మండలంలోని కడియపులంకలో ఇంటింటికీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను, టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత చేయబోయే హామీలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం దుళ్ల గ్రామంలోని ఎర్రకాలనీలో ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించారు. గత మూడు నెలలుగా కలుషితమైన తాగు నీటి వల్ల అనేక మంది వివిధ రోగాల భారిన పడుతున్నారని, ఇదే అంశంపై గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు ఎ.రామ్మోహన్ రావు, ఎంపిపి వి.సత్య ప్రసాద్, నాయకులు రఘురామ్, ఎం.సత్యనారాయణ, ఎ.చంటి, జనసేన పార్టీ అధ్యక్షులు ఎం.జిమ్మి, ఎం.ఏడుకొండలు, పాల్గొన్నారు.