ప్రజాశక్తి-పెద్దదోర్నాల రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం పెద్దదోర్నాలలో రూ.మూడు కోట్ల నాబార్డు నిధులతో అధునాతన హంగులతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ కేవలం యర్రగొండపాలెం నియోజకవర్గానికే జగనన్న ప్రభుత్వం రూ.వంద కోట్లు ఖర్చు చేసిందన్నారు. దోర్నాలలో గిరిజనుల కోసం రూ.50 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణం జరుగు తోందని అన్నారు. యర్రగొండపాలెంలో రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల వైద్యశాలను త్వరలోనే . మార్కాపురంలో రూ.450 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అందులో ఐదు కళాశాలలను ప్రారంభించిన విషయాన్ని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వైద్యసేవలకు దోర్నాల ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా దోర్నాల వైద్యశాల స్థాయిని 30 పడకల నుంచి 50 పడకలను పెంచినట్లు తెలిపారు. అన్ని హంగులతో ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 50 మంది వైద్య నిపుణులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ముందుగా వైద్య సిబ్బంది మంత్రి సురేష్‌పై పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఐటిడిఏ పీవో డాక్టర్ బి రవీంద్రారెడ్డి, ఈఈ విజయభాస్కర్, ఎంపిపి గుమ్మా పద్మజ యల్లేష్, జడ్పిటిసి లతా చంద్రకాంత్ నాయక్, సర్పంచ్ చిత్తూరి హారిక, డిసిహెచ్ ఎస్‌వి మూర్తి, వైద్యశాల సూపరింటెండెంట్ భాస్కర్ కుమార్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ఎం శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి, పిఆర్ డీఈ సుబ్బారెడ్డి, ఎంపిడివో నాసర్‌రెడ్డి, వైసీపీ నాయకులు మజీద్, పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.