వేరుశనగ బస్తాలకు నిప్పు

ప్రజాశక్తి-నిమ్మనపల్లి రైతు ఆరుగాలం శ్రమిస్తే కానీ బతకలేని ఈ రోజుల్లో చేతికి వచ్చిన వేరుశనగ పంటకు దుండగులు నిప్పు పెట్టి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిమ్మనపల్లి పంచాయతీ బుచ్చిరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈసారి కూడా తనకున్న పొలంలో వేరుశనగ పంటను సాగుచేశారు. పంట చేతికి రావడంతో వేరుశనగ చెట్లను పెరికి కాయలను విడిపించి శుక్రవారం రాత్రి అక్కడే ఉంచి, శనివారం తెల్లవారుజామున వరకు కాపలా కూడా ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో విడిపించిన వేరుశనగ కాయలను ఇంటికి చేర్చడానికి రైతు ఇంటికి వెళ్లారు. సుమారు 5 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన పి.మల్లప్ప వేరుశనగ కాయలు కాలుతున్నడం గమనించి రెడ్డెప్పకు సమాచారం అందించారు. రైతు చిన్న రెడ్డప్ప హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిశీలించగా అప్పటికే 50 మూటల వేరుశనగ కాయలు, తార్పాల్‌ పట్టలు కాలిపోయాయి. రైతుకు సుమారు రూ.1.50 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. సుమారు మూడు నెలల కిందట తిమ్మాపురానికి చెందిన నలుగురు వ్యక్తులతో గొడవలు జరిగాయి. ఈ గొడవల కారణంగా ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా శుక్రవారం మరలా దారి విషయమై నలుగురితో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో బాధితుని వేరుశనగ కాయలను, పంటను గొడవలకు పాల్పడిన వారు కాల్చివేసి తీవ్ర నష్టం కలిగించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు చిన్న రెడ్డెప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మదనపల్లి రూరల్‌ సిఐ శివాంజనేయులు, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి రైతుకు తగిన న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️