వేగంగా స్పందన అర్జీల పరిష్కారం

స్పందన అర్జీల

ప్రజాశక్తి-అమలాపురంరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన, జగనన్నకు చెబుదాం వినతులను పరిష్కరించడంలో అలసత్వం తగదని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన-జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌ సత్తిబాబుతో కలిసి కలెక్టర్‌ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, మండల, గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అధికారులు తమ వద్దకు వచ్చిన వినతులకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కార మార్గాలు చూపాలన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు వారి లాగిన్‌లోకి వచ్చిన ఫిర్యాదులను 24 గంటల్లో ఓపెన్‌ చేయడం లేదని రాష్ట్రస్థాయి టీములు దీన్ని మానిటర్‌ చేస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులు ఏ రోజు వచ్చిన ఫిర్యాదులను ఆ రోజునే ఓపెన్‌ చేసి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు పంపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకే సమస్యపై అర్జీలు పునరావతం అయితే అర్జీదారుని పిలిపించి ఆ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏ కారణంతో పరిష్కారం చూపలేకపోతున్నారో స్పష్టంగా ఫిర్యాదుదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్పందనకు 166 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, ఐసిడిఎస్‌ పీడీ జివి.సత్యవాణి, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, గ్రామ వార్డు సచివాలయ నోడల్‌ అధికారి కె.భీమేశ్వర్‌, డిఎం హెచ్‌ఒ ఎం.దుర్గారావుదొర, డిసిహెచ్‌ఎస్‌.పద్మశ్రీరాణి, డిపిఒ వి.కృష్ణకుమారి, సిపిఒ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసుబాబు, ఆర్‌డబ్లుఎస్‌ ఎస్‌ సిహెచ్‌ఎన్‌వి.కృష్ణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.జ్యోతిలక్ష్మి దేవి, డిఎస్‌ఒ ఎ.పాపారావు పాల్గొన్నారు.

➡️