నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్షాల నాయకులు
ప్రజాశక్తి-కాకినాడ
విభజన హామీల అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనిసిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, న్యూ డెమోక్రసీ నాయకులు జె. వెంకటేశ్వర్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అంటూ ఆదివారం స్థానిక మసీదు సెంటర్ లో నల్ల బెలూన్లతో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, న్యూ డెమోక్రసీ నాయకులు జె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చిన మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి దూకుడు గా వ్యవహరిస్తున్న మోడీ గో బ్యాక్ అన్నారు. కష్ణా జలాల విషయంలో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో, ప్రత్యేక హోదా తదితర అంశాల్లో ఎపికి కేంద్ర బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన అన్నారు. ప్రజలంతా మోడీ రాకను, విధానాలను వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, ప్రశ్నించడానికి వచ్చిన జనసేన బిజెపి కి వంతపాడడం మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు నాగేశ్వరరావు, నావహు, సిపిఎం నాయకులు కెఎస్. శ్రీనివాస్, కె.సత్తిరాజు, సిహెచ్.రాజ్ కుమార్, చంద్రమళ్ళ పద్మ, నర్ల ఈశ్వరి, సిహెచ్.వేణు, మలక వెంకట రమణ, అనపర్తి ఏడుకొండలు, జై రాం, కిశోర్, రాకెష్, సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.