వికలాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి

ప్రజాశక్తి – ఏలూరు

వికలాంగుల సామర్థ్యాన్ని గుర్తించి ఉన్నతస్థాయిలో రాణించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. ఈనెల ఐదో తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న వికలాంగుల ఆటల పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో పది వికలాంగుల సంక్షేమ పాఠశాలలతోపాటు 500 మంది దివ్యాంగులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వికలాంగులను అన్నిరంగాల్లోనూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒలింపిక్స్‌ మాదిరిగానే వికలాంగులకు నిర్వహించే పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే దిశగా తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. నగరంలో కొన్నిగోడలపై పెయింటింగ్స్‌ వేస్తున్నారని, అదే మాదిరిగా ఇండోర్‌ స్టేడియం ప్రహరీ మీద కూడా జాతీయస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు క్రీడాకారులు, వికలాంగుల క్రీడాకారుల ఫొటోలతో పెయింటింగ్‌ వేయించాలని, ఇందుకు అవసరమైన నిధులు కూడా ఇస్తామని చెప్పారు. ఏలూరులో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మూడు నెలల్లో భూమిని గుర్తించాలని ఏలూరు ఆర్‌డిఒను ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆదేశించారు. వేసవి కాలంలో ఇతరుల మాదిరి వికలాంగులకూ క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని అసోషియేషన్‌ నాయకులు కోరడంతో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిఎస్‌డిఒను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆడుదాం..ఆంధ్రా క్రీడోత్సవాలు సచివాలయస్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. అయితే వికలాంగులు తమకు జిల్లాస్థాయిలో ఒకేచోట క్రీడోత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల ఐదో తేదీన ఉమ్మడి పశ్చిమ జిల్లాకు సంబంధించి భీమవరం డిఎన్‌ఆర్‌ కళాశాలలో ముగింపు ఉత్సవాలు ఉంటాయన్నారు. ఇక్కడ జరిగే క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచి బహుమతులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. అవయవ లోపాల గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదని కొన్ని విషయాల్లో సకలాంగులకు మిన్నగాతమ ప్రతిభను చూపుతారన్నారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఆయన ఆవిష్కరించి మూడు చక్రాల సైకిల్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్‌డిఒ ఖాజావలి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాకాడ మణి, జిల్లా విద్యాశాఖాధికారి శ్యామ్‌ సుందర్‌, క్రీడాభివృద్ధి సంస్థ ఛీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు, దళిత సంఘ నాయకులు ఎం.అజరుబాబు, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు వీరభద్రరావు, ఇతర సంఘనాయకులు పాల్గొన్నారు.

➡️