వాతావరణ మార్పులతో రైతుల ఆందోళన

జగ్గంపేట మండలం రామవరం లో ధాన్యాన్ని బస్తాల్లో పోస్తున్న రైతులు

ప్రజాశక్తి-జగ్గంపేట రూరల్‌

పంట చేతికందే ఈ సమయంలో వచ్చిన అల్పపీప్రభావానికి పండించిన పంట చేతికి అందుతాయో లేదోనని రైతులు కలవర పడుతున్నారు. జగ్గంపేట మండలంలోని ఏలేరు ఆయకట్టు భూముల్లో వరి పంటలు పండి పోవడంతో చాలా వరకు యంత్రాల ద్వారా కోతలు ద్వారా కోస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల కూలీలతో పంటలు కోయిస్తున్నారు. గత నాలుగు రోజులుగా వాతావరణం మార్పులతో అన్నదాతలు ఆందోళనకు చెందుతున్నారు. యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని ఎండ కాస్తుందని రైతులు అరబెట్టే లోపు అంతలోనే మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం ఒబ్బిడి చేసేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు. కూలీలతో కోసిన పంటలు ఓపక్క పనలపై పొలాల్లోనే ఉండటంతో వాటిని ఆరబెట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావణ మార్పులతో అక్కడక్కడ చిరు జుల్లులు కురుస్తున్నాయి. వర్షాలకు ధాన్యం తడిచి రంగు మారుతుందనే భయంతో టార్పాలిన్లు కప్పుతున్నారు. ఒక వేళ ధాన్యం తడిస్తే మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తారా అనే సందేహాలను అన్నదాతలు వ్యక్తపరుస్తున్నారు. మళ్లీ కొద్ది రోజుల్లో దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో నవంబర్‌ 26, 27 తేదీల నాటికి ఆగేయ బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రం మీద వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.

 

 

➡️