ప్రజాశక్తి-రైల్వేకోడూరు రైల్వే ప్రయివేటీకరణ ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానిటైజేషన్ పేరుతో 35 నుంచి 99 ఏళ్ల వరకు దేశవిదేశీ కార్పొరేట్లకు కారు చౌకగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లీజుఅగ్రిమెంట్లు, ప్రయి వేటీకరణ చేస్తున్నారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. 8 యంత్రాల పరికరాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలను, 50 శాతం రైల్వే స్టేషన్లను, 68 వేల కిలోమీటర్ల రైల్వేలైన్లను, 500 ప్రయాణికుల రైలును, 300 గూడ్స్ రైలను ప్రయివేటీకరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత, రైల్వే ఏర్పాటుకు నాటి పెట్టుబడుదారులు ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 35 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. కేంద్రంలో బడ్జెట్ నిధులు కోత విధించారని, మేయింటెనెన్స్ లేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న దుర్మార్గాలను ఎదిరించి పోరాడాలని, వచ్చే ఎన్నికల్లో బిజెపికి బుద్ధి చెప్పి గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు, గనులను, ప్రయివేట్ పరం చేశారన్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఎపి వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ళ మని మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు పరిరక్షణ కోసం పోరాడి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మద్దిల ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, కోశాధికారి, కరతోటి హరి నారాయణ, సహాయ కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు. ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నాగిపోగు పెంచలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు సిహెచ్.హరిప్రసాద్, ఎం.సుబ్బరాయుడు, అంకయ్య, కె.కేశవులు, శివారెడ్డి, గొంజపల్లి ప్రభాకర్ పాల్గొన్నారు. పీలేరు: కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వే ప్రయివేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ఉప సంహరించుకొని ప్రభుత్వరంగంలోనే ఉంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో పీలేరు రైల్వేస్టేషన్ ట్రాక్‌పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేను ప్రయివేటీకరించడం ద్వారా సామాజిక భద్రతకు తూట్లు పొడవడమేనని సిఐటియు జిల్లా కార్యదర్శులు డి.భాగ్యలక్ష్మి, డి.వెంకట్రామయ్య, ఎస్.మెహరున్నీసా, ఎస్.ఓబులమ్మ పేర్కొన్నారు. రైల్వేలో అన్ని రకాల టికెట్ల ధరలు పెంచడం, వసతులు తగ్గించడం, ప్రజలపైనే భారాలు మోపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కార్మికులు పురుషోత్తం, శంకరయ్య, నాగరాజు, ఇజ్రాయిల్, హరి ప్రసాద్, రసూల్ పాల్గొన్నారు.