ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్, అనకాపల్లి : భారతీయ రైల్వేల ప్రయివేటీకరణ తక్షణమే ఆపాలని సిఐటియు ఆధ్వర్యాన విశాఖ, అనకాపల్లి రైల్వే స్టేషన్ల వద్ద గురువారం నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ : విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన విశాఖ రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ధర్నానుద్దేశించి సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ప్రయాణం కల్పించి గమ్యస్థానానికి చేర్చుతున్న భారతీయ రైల్వేను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కారుచౌకగా అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారన్నారు. మోడీ గత 9 ఏళ్ళలో ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా ఏర్పాటు చేయకపోగా, ఉన్న సంస్థలను అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 150 రైళ్లు, రైల్వే ట్రాక్‌లు, రైల్వే స్టేషన్లను ఇప్పటికే మోడీ ప్రభుత్వం అదానీకి కట్టబెట్టడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రైల్వేలో మూడు లక్షలకు పైచిలుకు ఖాళీ పోస్టులుంటే వాటిని భర్తీచేయకుండా, నిరుద్యోగ యువతను తీవ్ర మోసం చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. అత్యధిక విలువైన ఆస్తులు కలిగి ఉన్న రైల్వే స్థలాలు, కల్యాణమండపాలు, పార్కులు, స్టేడియాలను సైతం కాజేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికే పాసింజరు రైళ్లను రద్దుచేసి హైస్పీడ్ రైళ్ళను పెంచడం, ఉన్న జనరల్ కోచ్‌లు, స్లీపర్ కోచ్‌లు తగ్గించి ఎసి కోచ్‌ల సంఖ్య పెంచి ప్రయాణికులపై పెనుభారాలు మోపుతున్నారన్నారు. రైల్వే ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రజలు మరింత ఇబ్బందులు పడే ప్రమాదముందని, ప్రజలంతా దీన్ని వ్యతిరేకించాలని కోరారు. మోడీ కార్పొరేట్ నిర్ణయాలను రాష్ట్రలోని వైసిపి, టిడిపి, జనసేన సమర్థించడాన్ని తప్పుపట్టారు. విభజన హామీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ప్రయివేటీకరణ జరిగితే రైల్వేజోన్ వచ్చినా ప్రయోజనం ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రాంతీయ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్, ఎం.సుబ్బారావు, నాయకులు వై.రాజు, డి.కొండమ్మ, కె.పెంటారావు, ఒమ్మి అప్పారావు, కె.సత్యన్నారాయణ, కెవిపి.చంద్రమౌళి, యుఎస్‌ఎన్.రాజు, కె.కుమారి, ఎన్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి : కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరణ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన గురువారం అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల పన్నులతో రైల్వేను నిర్మించగా, దానిని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. రైల్వే రంగాన్ని ఆదానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని మండిపడ్డారు. అందులో భాగంగానే ప్యాసింజర్ రైలు రద్దు చేశారని, చిన్న చిన్న స్టేషన్లను మూసేశారని, వందే భారత్, నమో భారతం వంటి రైళ్ల సంఖ్య పెంచి, దోపిడీ చేస్తుందని విమర్శించారు. రైల్వేలో మూడున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్లే రైల్వే ప్రమాదాలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైల్వే రంగం ప్రభుత్వ రంగంలో ఉండగా, బీజేపీ ప్రభుత్వం మాత్రం మన దేశంలోని రైల్వేని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. కావున ప్రజలందరూ బిజెపి విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకరరావు, కోశాధికారి వివి.శ్రీనివాసరావు, నాయకులు పరమేశ్వరరావు, డి శ్రీను, గంటా శ్రీరామ్, అప్పారావు, కళ్యాణం, సురేష్, ఉమామహేశ్వరరావు, తెలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు