ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గురువారం గుంటూరు, పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల ఇప్పటికప్పుడు పెద్దగా ఇబ్బంది లేకున్నా ఎక్కువ రోజులు కొనసాగితే పంటలకు నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభం అవుతున్నాయి. జులై మొదటి వారంలో వెద పద్దతిలో సాగు చేసిన పైరు కోతలకు సిద్ధమైంది. ప్రధానంగా కొల్లిపర ప్రాంతంలో కోతలు ఇప్పటికే ప్రారంభించారు. ఈపరిస్థితుల్లో మరో మూడు రోజులపాటు కోస్తా ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించడంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా చేతికి అందివచ్చిన పత్తికి కూడా నష్టం ఉంటుందని చెబుతున్నారు. ఒక మోస్తరు వర్షమైతే పెద్దగా నష్టం ఉండదని భారీవర్షం కురిస్తే పత్తిపై పూత, కాయలు, తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి నేలపాలవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 15 వరకు పంటలు బెట్టకు వచ్చి ఇబ్బంది పడుతున్న రైతులకు నాలుగు రోజులుగా అడపాదడపాగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పైర్లకు ఊపిరి పోశాయి. బెట్టకువచ్చిన పొలాలుకొంత మేరకు తెప్పరిల్లాయి. పైర్లకు జీవకళ వచ్చింది. మొక్కలు బతుకుతాయో లేదో అని కంగారు పడిన ప్రాంతాల్లో ఇప్పటివరకు కురిసిన వర్షాలు మేలు చేకూర్చాయి. మరోవైపు ఇప్పటికే రెండ్రోజులుగా మరో మూడ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే సమాచారంతో రైతులు కంగారు పడుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచిగురువారం ఉదయం వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. పల్నాడు జిల్లా రాజుపాలెం 47.8 మిల్లీమీటర్లు, నర్సరావుపేట 42.8, పిడుగురాళ్ల 31.4, సత్తెనపల్లి 29.4, రొంపిచర్ల 25.2, చిలకలూరిపేట 18.6, నాదెండ్ల 16.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా చేబ్రోలులో 32.2 మిల్లీ మీటర్లు, వట్టిచెరుకూరు 26.4, కాకుమాను 18.8, ఫిరంగిపురం 15.6, గుంటూరుపశ్చిమ 13.8, ప్రత్తిపాడు 12.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.