రైతులకు భారంగా ‘జలకళ’..!

ప్రజాశక్తి – భీమడోలు

మెట్ట ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం అమలు తీరు పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కాగితాలపై లెక్కలు కట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. 2021లో పథకం ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించిన రాయితీలు, ఉచిత బోరు సౌకర్యం నిబంధనలు 2023లో అమల్లోకి వచ్చే సమయానికి మారిపోయాయని రైతులు అంటున్నారు. దీనివల్ల ఒక్కోబోరు ఏర్పాటుకు సుమారు రూ.మూడు లక్షల వరకూ అదనంగా ఖర్చవుతుందని రైతుల పేర్కొంటున్నారు. మండలంలోని మెట్టప్రాంత గ్రామాలైన సూరప్పగూడెం, పొలసానిపల్లి, పాక్షికంగా భీమడోలుతో పాటు అంబర్‌పేట, దుద్దేపూడి, కోడూరుపాడు గ్రామాల్లో పథకం అమలు కోసం 2021లో 115 దరఖాస్తులు వచ్చాయి. వాటికి అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా బోర్‌ వేయడం, కేసింగ్‌ పైపులు అమర్చడం, విద్యుత్‌ సౌకర్యం కల్పన, విద్యుత్‌ పరికరాల ఏర్పాటు, విద్యుత్‌ మోటారు బోరు సమకూర్చడం వంటి అంశాలున్నాయి. దీనికోసం యూనిట్‌కు రూ.ఎనిమిది లక్షల వరకూ మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ 2023 నాటికి యూనిట్‌ ధర పెరిగిందంటూ విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునే భారాన్ని అధికారులు రైతులపై వేశారు. దీనికోసం రైతులు అదనపు విద్యుత్‌ స్తంభాలు వేసుకోవడం, కండక్టర్ల ఖర్చు భరించటం వంటి బాధ్యతను తీసుకున్నారు. ఇదే క్రమంలో విద్యుత్‌ అధికారుల అనుమతుల కోసం సుమారు రూ.రెండు లక్షల వరకూ రైతులు సొంతంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. కనీసంగా రెండున్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతులను వ్యవసాయపరంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు కార్యక్రమం ప్రారంభించే సమయంలో అధికారులు ప్రకటించారు. ఇదే క్రమంలో జియాలజిస్ట్‌ సిఫార్సు మేరకు బోర్‌ వేసే స్థలాన్ని ఎంపిక చేస్తారు. ఏడు అంగుళాల విస్తీర్ణం గల బోరు గొయ్యి 400 అడుగుల వరకు వేసి, దానిలో ఆరు అంగుళాల విస్తీర్ణం గల కేసింగ్‌ పైపులను 40 వరకూ అమర్చాల్సి ఉంది. దీనికోసం రూ.నాలుగు లక్షల వరకూ ఖర్చవుతుందని అధికారులు అంచనాలు కట్టారు. పనులు చేసేందుకు గుత్తేదారులను ఏర్పాటు చేశారు. ఆ తరువాత విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రైతులు తమ ప్రయత్నాలు చేసుకోవాలి. ఆపై భూగర్భ జలాల లభ్యత 200 అడుగులు ఉంటే 7.50 హెచ్‌పి సామర్థ్యం గల మోటారు, 300 అడుగులు ఉంటే 10హెచ్‌పి సామర్థ్యం గల మోటార్లను సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు 25 మోటార్ల కోసం ఉపాధి హామీ అధికారులు ప్రతిపాదించగా 15 మోటార్లకు అనుమతులు లభించాయి. వీటిలో తొలి దశలో ఆరు మాత్రమే వచ్చాయి. వీటిని అంబరుపేట, సూరప్పగూడెం, భీమడోలు గ్రామాలకు రెండేసి వంతన కేటాయించారు. ఎట్టకేలకు అంబరుపేటలో 10 హెచ్‌పి సామర్థ్యం గల మోటార్లను బిగించారు. దీన్ని పక్కనపెడితే ఆ ప్రాంత రైతులు బోరు వేసి ఏడాది దాటినప్పటికీ అధికారులు మోటార్లను సరఫరా చేస్తారన్న నమ్మకం లేక వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు సుమారు 300 నుంచి 400 అడుగుల లోతు గల భూగర్భ జలాలను బయటకు తీసేందుకు రూ.రెండు లక్షల నుంచి రూ.రెండున్నర లక్షల వ్యయంతో 20 నుంచి 30 హెచ్‌పి సామర్థ్యం గల మోటార్లను బిగించి రైతులు గత ఆరు నెలల కాలంగా వ్యవసాయం చేస్తున్నారు. దీని నుంచి మూడు అంగుళాల బోరు నీరు అడుగు దూరంపైబడి వెదజల్లితో నీటిని సరఫరా చేస్తుంది. దీంతో రైతులు సజావుగా సాగు చేస్తారు.తాజాగా 10హెచ్‌పి సామర్థ్యం గల బోరు మోటారును ప్రభుత్వం అందజేసిన నేపథ్యంలో దాన్ని అప్పటికే పనిచేస్తున్న బోరు మోటారును తొలగించి దాని స్థానంలో బిగించారు. 10హెచ్‌పి సామర్థ్యం గల ఒక్కొక్క బోరు మోటారుకు రూ.1.56 లక్షల వంతున అధికారులు లెక్క కట్టారు. దీని ద్వారా బోరు నుంచి రెండు అంగుళాల విస్తీర్ణంతో కేవలం ఆరు అంగుళాల దూరం మాత్రమే నీటిని అందిస్తుంది. ప్రస్తుతం భూగర్భ జలాలు బాగున్న సమయంలో ఈ విధంగా ఉంటే రానున్న కాలంలో ఏ విధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మోటార్లను ఇటీవల ఏర్పాటు చేశారు. దీంతో రైతుల స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమకు ఎక్కువ సామర్థ్యం గల మోటార్లను సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ విషయాలపై ఉపాధి హామీ అధికారులను వివరణ కోరగా రైతుల విజ్ఞప్తులను ఉన్నతాధికాలకు తెలియజేశామని చెప్పారు.

➡️