‘రేణిగుంట -కడప’ రోడ్డు విస్తరణలో..నచ్చినోళ్లకు… నచ్చినట్లుగా… నష్టపరిహారం..

Nov 30,2023 21:36
చిన్న ఇంటికి రూ.69 లక్షలు నష్టపరిహారం ఇస్తూ జాబితాలో రూపకల్పన

‘రేణిగుంట -కడప’ రోడ్డు విస్తరణలో..నచ్చినోళ్లకు… నచ్చినట్లుగా… నష్టపరిహారం..!రేణిగుంట – కడప నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు గత ఏడాది రెవెన్యూ, నేషనల్‌ హైవే యంత్రాంగం భూసేకరణ చేపట్టారు. అయితే కొంతమంది రెవెన్యూ యంత్రాంగం ప్రజాప్రతినిధులతో, దళారులతో కుమ్మక్కయ్యి ‘కమీషన్‌’ కుంభకోణాన్ని తెరపైకి తెచ్చారు.. కమీషన్‌ ఇచ్చిన వారికి ఐదారింతలు ఎక్కువగా, ఇవ్వలేని పేదలకు తక్కువగా నష్టపరిహారాన్ని అందజేసి ‘వివక్ష’ పాటించారు. ఈ తారతమ్యమే పేదలను బాధించింది.. తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని తీసుకుంటూ అధికార యంత్రాంగం ‘కమీషన్‌’ వ్యాపారం చేయడంపై గుర్రుమన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డికి, ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డికి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు, రేణిగుంట తహశీల్దార్‌కు, నేషనల్‌ హైవే రోడ్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో రోడ్డెక్కారు. తమకు న్యాయబద్దమైన పరిహారం ఇచ్చేంత వరకూ ‘వివక్ష’ చూపిన అధికారులపై పోరాడతామని పేదలంతా ఒక్కటయ్యారు. ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ ఇంద్రనగర్‌లో 1987లో సర్వే నంబర్‌ 185/2లో మాజీ సైనికులకు ఇంటి పట్టాలను ఇచ్చారు. పన్నేండేళ్ల తరువాత 1993లో జీవో నంబర్‌ 117 ప్రకారం మాజీ సైనికుల నుంచి పేదలు ఈ భూములను కొనుగోలు చేశారు. ఇక్కడ 50 మంది పేదలు ఇళ్లు, షాపులు నిర్మించుకుని జీవిస్తున్నారు. రేణిగుంట – కడప మార్గంలో నాలుగు లైన్ల రహదారి భూసేకరణలో 50 మందికి సంబంధించిన వారు భూములు కోల్పోయారు. అయితే వారికి ఇచ్చే పరిహారంలో అవకతవకలు జరగడంతో వారి బాధ వర్ణనాతీతం. ఇక్కడ ఉన్న బాధితులు 50 మందికి రెండు సెంట్లు చొప్పున భూమి ఉంది. కొందరు ఇళ్లలోనే షాపులు నిర్మించుకుని ఉన్నారు. అయితే రెవెన్యూ అధికారులకు 50 శాతం కమీషన్‌ ఇవ్వలేదన్న సాకుతో వారికి నష్టపరిహారం 5-7 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. 50శాతం కమీషన్‌ ఇచ్చిన వారికి మాత్రం 35 -39 లక్షలు ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల చిన్న స్థలానికి 65 లక్షలు, కొంత పెద్ద స్థలం ఉన్నా 39 లక్షలు ఇస్తుండటం గమనార్హం. కడప జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలకూ ఎక్కువ నష్టపరిహారం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వడం లేదని, దళారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగా పేదలకు నష్టపరిహారం ఇస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. భూసేకరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారంలో వ్యత్యాసం లేకుండా న్యాయబద్దంగా ఇవ్వాలని కోరుతున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం ఇవ్వాలి : ఎస్‌.హైదర్‌అలీ రేణిగుంట – కడప నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి నా స్థలం పోయింది. మార్కెట్‌ విలువ ప్రకారం నా స్థలానికి నష్టపరిహారం ఇవ్వాలి. రెవెన్యూ అధికారులు చాలా తక్కువ పరిహారం ఇవ్వడానికి జాబితా తయారు చేయడం అన్యాయం. రెవెన్యూ, నేషనల్‌ హైవే రోడ్డు అధికారులు న్యాయం చేయాలి. రోడ్డు విస్తరణ వల్ల నా కుటుంబానికి ఉపాధి పోయింది. 50శాతం కమీషన్‌ అంగీకరించలేదు : లక్ష్మీదేవి కరకంబాడి ఇందిరానగర్‌ పంచాయతీ పరిధిలో రోడ్డు విస్తరణ పేరుతో నా స్థలం పోయింది. రెవెన్యూ అధికారులు 50 శాతం కమీషన్‌ ఇవ్వాలని కోరారు. అందుకు మేం అంగీకరించలేదు. ఈ కారణంగా నష్టపరిహారం చెల్లింపు జాబితాలో మా పేర్లతో తక్కువ పరిహారం రాశారు. ఎంఎల్‌ఎ, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మాకు న్యాయం చేసి ఆదుకోవాలి. చిన్న ఇంటికి రూ.69 లక్షలు నష్టపరిహారం ఇస్తూ జాబితాలో రూపకల్పన

➡️