ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈశాన్య ముఖద్వారాన్ని నిర్మించడానికి సుమారు రూ.9 లక్షల ఖర్చు అయిందని ఎపి బార్ కౌన్సిల్ మెంబర్, న్యాయవాది బివి.కృష్ణారెడ్డి అన్నారు. ఈ ముఖద్వారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమ కుమార్‌తో కలిసి శనివారం సాయంత్రం ప్రారంభించి తనను అభినందించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఆదివారం ఆయన ప్రజాశక్తితో ప్రత్యేకంగా మాట్లాడుతూ గతంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో మినరల్ వాటర్ ప్లాంట్, బివిఎ రంగారెడ్డి సమావేశ మందిరం, న్యాయ దేవత విగ్రహం ఏర్పాటు చేయడం, పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు ఎన్నో చేశానని తెలిపారు. సంపాదించడమే కాకుండా సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించటం తనకు ముందు నుంచి ఉన్న అలవాటు అని, ఆ సేవా భావంతోనే రెడ్‌క్రాస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యానని, తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన తెలిపారు.