ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : క్రీడలు మానసిక ఉత్తేజానికి, శరీర దారుఢ్యానికి దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆటలాడాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్‌పి పాఠశాలలో 33వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ (బాల, బాలికల) అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి ఖోఖో ఛాంపియన్‌షిప్-2023 పోటీలను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. తొలుత భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడా ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని అన్నారు. నిరంతరం తరగతి గదిలో పరీక్షలకు సిద్ధం కావడం వంటి ఒత్తిడి నుండి విద్యార్థులకు ఉపశమనం కలుగుతుందన్నారు. మూడ్రోజులపాటు నిర్వహించనున్న పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల కోసం మంచి వసతులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పార్వతి, ఎంపిపి ఎం.శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి పి.చిట్టిబాబు, పిఇటిలు పాల్గొన్నారు.