ప్రజాశక్తి – చాగల్లు
దేవరపల్లి విధుల్లో ఉంటూ మృతి చెందిన రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కేతా పోసమ్మ డిమాండ్ చేశారు. దేవరపల్లి పిహెచ్‌సి పరిధిలోని ఆశా వర్కర్ల నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం స్థానిక పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోసమ్మ మాట్లాడుతూ రమాదేవి మృతి చెందిన సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారని, ఆ హామీని 13 నెలలు దాటిని అమలు చేయలేదన్నారు. ఆమె కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల పద్ధతిలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, రాజ్ కుమారి పాల్గొన్నారు. దేవరపల్లిలో ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న విధుల బహిష్కరణ కార్యక్రమం కొనసాగింది. స్థానిక పిహెచ్‌సి వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి వైద్యాధికారి డి.సాంబశివరావుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు రత్నాజీ, ఆశ కార్యకర్త స్వర్ణ మాట్లాడుతూ రమాదేవి కుటుంబానికి న్యాయం చేసే వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు. ఆశాల ఉద్యమానికి ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, ఇందిరా, నాగమణి, లిల్లీ గ్రేస్, మోదమ్మ, పుష్పవతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.