సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శుక్లా
ప్రజాశక్తి-అమలాపురం
జిల్లాలో ఖరీఫ్ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు చల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.బుధవారం అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్‌ఒ సిహెచ్.సత్తిబాబు, రాష్ట్ర రైతు విభాగపు జోనల్ ఇన్చార్జి కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఓలేటి దాసు, డ్రైనేజీ ఇఇ ఏడుకొండలు తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబీ రెండవ పంట వేసుకోవడానికి అనువైన వాతావరణము ఉందని, అవసరమైన విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని రైతులు పంట సాగు చేసుకునే విధంగా ముందుకు రావాలని అన్నారు. రబికి కావలసిన నీటి సదుపాయం ఉందని అవసరమైన మరమ్మతులు చేపడతామని కలెక్టర్ తెలిపారు. పూడికతీత పనుల తో పాటు వివిద కాలువ పనుల్లో పంట పండించే రైతులను భాగస్వామ్యం చేస్తే సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. అంతర్వేది పరిసర ప్రాంత రైతుల అవుట్ ఫాల్ స్లూయిజ్ పనులను చేపట్టాలనే రైతుల అభ్యర్థన మేరకు రైతు విభాగ ప్రతినిధులు పరిశీలన అనంతరం కాలువ పూడిక తీత పనులకు కావలసిన నిధులు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా అంతర్వేది దగ్గర గొంది పంట కాలువలతో పాటు రాళ్ల కాలువకు పూడిక తీయుటకు కావలసిన నిధులు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా రైతు విభాగం ప్రతినిధుల సూచనలతో పసలపూడి లాకుల వద్ద కల్వర్టు దెబ్బతినడం వల్ల 300 రైతులు పంటలు వేసుకోవడానికి అవకాశం కోల్పోతున్నారని సమాచారంతో తక్షణం మరమ్మతుల కింద రూ.రెండు లక్షల 75 వేలు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పంట సాగుకు సాగునీరు అందించడంలో గండి పడిన ప్రాంతాల్లో పనులు తక్షణ చేపట్టే విధంగా అవసరమైన నిధులు సమకూర్చుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రైతు విభాగపు సభ్యులు జున్నురి రామారావు, ఆదర్శ రైతు సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.