మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిద్దాం..

Nov 25,2023 23:20 #మోడీ

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, సామాజిక న్యాయానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సమాధి కడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శులు కంకణాల ఆంజనేయులు, బి.రఘురామ్‌ విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, దళితులు, అనగారిన వర్గాలపై జరుగుతున్న అకత్యాలు అరికట్టాలని డిసెంబర్‌ 4 న నిర్వహిస్తున్న చలో ఢిల్లీకి ప్రజలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమస్యలతో కూడిన అర్జీలను దేశవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి ఇచ్చేందుకు శనివారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. డిసెంబర్‌ 4న జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు మాట్లాడారు. దళిత ప్రజాసంఘాల నాయకులు కొమ్ము సుజన్‌ మాదిగ, అంగలకుర్తి ప్రసాద్‌, రమేష్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. బాలకోటయ్య, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు కెఎఫ్‌ బాబు, సిహెచ్‌ వినోద్‌ లు పాల్గొని ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ నాయకులు ఉబ్బా వెంకటేశ్వర్లు, కంకణాల వెంకటేశ్వర్లు, అట్లూరి రాఘవులు, అత్తింటి శ్రీనివాసరావు, వి మోజెస్‌, కాలే మల్లికార్జునరావు, డి నారాయణ, కొమ్ము బ్రహ్మయ్య పాల్గొన్నారు.

➡️