మొక్కుబడిగా కౌన్సిల్‌ సమావేశం

Nov 30,2023 23:01
16 నిమిషాల్లో మిగిసిపోవడం

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌

సామర్లకోట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం మొక్కుబడిగా సాగింది. అజెండాలో 17 అంశాలను పొందుపర్చినా వాటిపై చర్చ లేకుండానే ఆమోదం తెలిపి, కేవలం 16 నిమిషాల్లోనే కౌన్సిల్‌ సమావేశాన్ని ముగించడం విశేషం. సామర్లకోట మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన గురువారం ఉదయం 11.20 గంటలకు ప్రారంభం అయ్యింది. నిర్ణీత సమయానికి 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన సమావేశం కేవలం 16 నిమిషాల్లోనే ముగించడం స్వపక్షమే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి కన్పించింది. సమావేశం ప్రారంభం అయ్యిన వెంటనే పట్టణంలో నెలకున్న సమస్యలపై చర్చించేందుకు జీరో అవర్‌ను ఇవ్వాలని వైసిపి కౌన్సిలర్‌ పెండ్యాల నాగలక్ష్మి కోరారు. అయితే ఇందుకు ఛైర్‌పర్సన్‌ తిరస్కరించారు. ఒక్కరోజు వ్యవధిలోనే షాడో సమావేశం నిర్వహించామని, ఏమైనా సమస్యలు ఉంటే తన చాంబర్‌లో మాట్లాడుకుందామని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. సిఎం జగన్‌ పర్యటన సందర్భంగా అయిన ఖర్చులను మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి చెల్లించడాన్ని వైసిపి కౌన్సిలర్‌ కరణం రాజ్‌కుమార్‌, టిడిపి కౌన్సిలర్‌ బలుసు వాసు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నెలలో వాయిదా వేసిన అంశాన్ని మరలా ఎందుకు ఆమోదిస్తున్నారో వివరణ ఇవ్వాలని వారు నిలదీశారు. వైస్‌ ఛైర్మన్‌ ఊబా జాన్‌ మోజెస్‌, సీనియర్‌ కౌన్సిలర్‌ ఆవాల లక్ష్మినారాయణ, సేపేని సురేష్‌, జట్లా మోహన్‌ తదితరులు మాట్లాడుతూ గత నెలలో కొన్ని సందేహాల వల్ల కొన్ని అంశాలను వాయిదా వేశామని, ఆ అనుమానాలను అధికారులు నివృత్తి చేయడంతో ఆమోదిస్తున్నామని చెప్పారు. సిఎం పర్యటన ఖర్చుల అంశంపై స్వపక్షం, విపక్షం అన్నా తేడా లేకుండా కౌన్సిలర్ల మధ్య పది నిమిషాలపాటు అరుపులు, కేకలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చైర్‌పర్సన్‌ సిఎం పర్యటన ఖర్చుల ఆమోదంపై చేతులు ఎత్తాలని సూచించారు. దీంతో మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ఆ ఖర్చుల అంశాన్ని ఆమోదించినట్లు చైర్‌పర్సన్‌ ప్రకటించారు. టిడిపి కౌన్సిలర్‌ బలుసు వాసు, వైసిపి కౌన్సిలర్‌ కరణం రాజ్‌కుమార్‌లు ఖర్చుల ఆమోదంపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే అజెండాలోని మిగిలిన 16 అంశాలను ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదిస్తున్నట్లు వైస్‌ ఛైర్మన్‌ మోజెస్‌ ప్రకటించి సమావేశం హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. అజెండాను ఏకపక్షంగా ఆమోదించడం పట్ల టిడిపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కౌన్సిలర్‌ బలుసు వాసు అన్నారు. మొత్తంగా ప్రజా సమస్యల ప్రస్తావన, అజెండాలో 17 అంశాలపై ఎటువంటి చర్చ లేకుండానే సాధారణ కౌన్సిల్‌ సమావేశం 16 నిమిషాల్లో మిగిసిపోవడం పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామారావు, మేనేజర్‌ సీరెడ్డి అచ్యుతరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️