మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ : యుటిఎఫ్‌

Nov 28,2023 21:05

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, ఉన్నత పాఠశాలల్లోని అన్ని పోస్టులను అప్గ్రేడ్‌ చేయాలని, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని యుటియఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాళెం మహేష్‌ బాబు తెలిపారు. మంగళవారం ఉద్యమ కార్యా చరణకు సంబంధించి సన్నాహక సమావేశం యుటిఎఫ్‌ భవన్‌లో నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ 2022 జూన్‌లో మున్సిపల్‌ ఉపాధ్యాయుల సర్వీసులు, యాజమాన్యం నుంచి పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలోకి యుటిఎఫ్‌ ఉద్యమం కారణంగా వచ్చాయని చెప్పారు. నిరంతర ప్రాతినిథ్యాలతో మున్సివల్‌ ప్రధానోపాధ్యా యులకు డిడిఒ అధికారాలు, జీతాలు, మ్యాపి ంగ్‌ సమస్యలు పరిష్కరించామని తెలిపారు. మౌలికమైన సమస్యలు కొన్ని ఇప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రభుత్వ, పం చాయతీరాజ్‌ పాఠశాలల మాదిరి మున్సిపల్‌ టీచర్ల పోస్టులను కూడా సబ్జెక్టు టీచర్లుగా అప్‌ గ్రేడ్‌ చేసి ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌జిటిలుగా కొనసా గుతున్నారని, మున్సిపల్‌ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినందున, సబ్జెక్టు టీచర్ల కొరత తగ్గించడానికి వెంటనే అప్గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. విద్యాశాఖ పర్యవేక్షణలోకి వచ్చిన తర్వాత కూడా బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించలేదని, ప్రభుత్వ, పంచాయితీరాజ్‌ ఉపాధ్యాయులతో సమానంగా బదిలీలు, ప్రమోషన్లు, అప్గ్రేడేషన్‌ అమలవుతున్నాయని చెప్పారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదని తెలిపారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్‌ నిర్వహించాలని కోరారు. వీటితో బాటు మున్సిపల్‌ టీచర్ల పిఎఫ్‌ ఖాతాలను వెంటనే ప్రారంభించాలని, గతంలో ఉన్న పిఎఫ్‌ మొత్తాన్ని డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు చెల్లించాలన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి యుటియఫ్‌ చేపట్టే దశలవారీ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 29న డిఇఒ, కలెక్టర్‌కు, డిసెంబర్‌ 1న విద్యా శాఖ కమిషనర్‌కు నోటీసులు, 5న మున్సిపల్‌ కేంద్రాల్లో నిరసన, 12, 13, తేదీల్లో అన్ని మున్సిపాల్టీల్లో ప్రచారం, 15న కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు, 20, 22న జిల్లాల వారి సదస్సులు, 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏజాస్‌ అహ్మద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ రూతు ఆరోగ్యమేరి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు జి. వెంకటసుబ్బయ్య, సలీం బేగ్‌, కరిముల్లా, బత్తుల చంద్రశేఖర్‌, గోపీనాథ్‌, సుజిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️