ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు

ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు

విజేతలుగా బాలురు విభాగంలో కడప, బాలికల విభాగంలో అనంతపురం జట్లు

ప్రజాశక్తి -తగరపువలస : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన భీమిలి ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, చిట్టివలస ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, అమేయా వరల్డ్‌ స్కూల్‌లో నిర్వహించిన 67వ అంతర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 21న ప్రారంభమైన ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన 14 ఏళ్ల లోపు 468 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగిన పోటీల్లో బాలుర విభాగంలో వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జట్టు, బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజేతగా నిలిచాయి. బాలుర విభాగంలో అనంతపురం, బాలికల విభాగంలో కర్నూలు జట్లు రన్నరప్‌గా నిలిచాయి. బాలుర విభాగంలో విశాఖ జిల్లా జట్టు, బాలికల విభాగంలోవైఎస్‌ ర్‌ కడప జిల్లా జట్లు 3వ స్థానంలో నిలిచినట్లు ఎస్‌జిఎఫ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ టి నాగేశ్వరరావు తెలిపారు. 52 మంది కోచ్‌లు, మేనేజర్లు, 40 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, 20 మంది రిఫరీలు సహకరించారు.విజేతలకు షీల్డ్‌లు అందజేతగురు వారం సాయంత్రం స్థానిక అమేయ వరల్డ్‌ స్కూల్‌లో జరిగిన ముగింపు వేడుకలో విజేతలకు జివిఎంసి ఒకటో జోన్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము షీల్డ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గలుపోటములను ఒకేలా స్వీకరించాలని, పోటీతత్వం, క్రీడాస్ఫూర్తిని అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో రాణిస్తే భవిష్యత్‌ బంగారుమయం అవుతుందన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు ప్రభాకర్‌, విశాఖ, అనకాపల్లి జిల్లాల వ్యాయామ సంఘం అధ్యక్షులు అప్పలరాజు, లలిత్‌కుమార్‌, కెఎం నాయుడు, కిరణ్‌కుమార్‌, సతీష్‌, కోలా చంద్రశేఖర్‌ పాల్గొన్నారు

ఫుట్‌బాల్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన అనంతపురం బాలికల జట్లు

➡️