ప్రజాశక్తి – ఆలమూరుమార్షల్ ఆర్ట్స్‌పై మక్కువ కనబరిచే యువతకు బ్రూస్లీ ఆదర్శం అని ప్రముఖ వ్యాపారవేత్త, టిడిపి సీనియర్ నేత చుండ్రు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కలవచర్లలో మదర్ థెరెసా స్పోర్ట్స్ అకాడమీ ఆవరణలో వ్యవస్థాపక గ్రాండ్ మాస్టర్ టి.అబ్బులు ఆధ్వర్యంలో సోమవారం బ్రూస్ లీ జయంతి వేడుకలను చిన్నారుల కేరింతల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నటునిగా, మార్షల్ ఆర్ట్స్‌కు ఐకాన్‌గా చైనీస్ మార్షల్ విద్యకు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సాధించి పెట్టిన కుంగ్‌ఫూ వీరుడు, మార్షల్ ఆర్ట్స్ ప్రియుల ఆరాధ్య దైవం బ్రూస్ లీ అన్నారు. లీ బతికింది కొన్నేళ్లే అయినా మార్షల్ ఆర్ట్స్‌కు మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు. బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ వ్యాప్తికి చేసిన కషిని కొనియాడారు. అనంతరం మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు వివిధ యుద్ధ కళల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ బుంగ ఉదరు కుమార్, సీనియర్ మాస్టర్స్ లంకే వెంకటరెడ్డి, నార్గని చంద్రకుమార్, మాస్టర్స్ నిచ్చినకోళ్ల సుబ్రహ్మణ్యం, మెరిపే సత్యకాంత్, ఎస్.రాజు, ఎం.మోషే, వి.సుధీర్, వి.సత్యనారాయణ, ఎల్.కిషోర్, తదితరులు పాల్గొన్నారు.