మార్కెట్‌కు స్థల కేటాయింపు ఏదీ?

ప్రజాశక్తి – చాపాడు మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్‌కు స్థల కేటాయింపులు లేకపోవడంతో రైతులు, వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారు. మైదుకూరు మండల పరిధిలో టమోటా, పచ్చిమిర్చి ఇతర కూరగాయలు, ఆకుకూరల సాగును రైతులు అధికంగా చేపడతారు. వాటిని అమ్మడం కోసం మైదుకూరు, ప్రొద్దుటూరు పట్టణాలకు తరలిస్తారు. అయితే మైదుకూరులోని వనిపెంట రోడ్డులో ప్రస్తుతం మార్కెట్‌ ఉంది. మార్కెట్‌కు ప్రత్యేక స్థలం కేటాయింపు లేకపోవడంతో రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అంకా లమ్మ గుడి సమీపంలో అమ్మకాలు రైతులు చేపడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్‌కు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసి దుకాణాలను ఏర్పాటు చేస్తే అటు రైతులకు ఇటు వ్యాపారులకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్‌కి గాని, వివిధ గ్రామాలకు వెళ్లే ఆటోలు నిలుపుకునే స్థలం పార్కు స్థలం ఎలాంటి ఏర్పాట్లు లేవు. ప్రజల మీద మాత్రం మున్సిపాలిటీ పన్ను అధికంగా వసూలు చేస్తోంది. నంద్యాల రోడ్డులో ఉన్న పశువుల సంతను బద్వేల్‌ రోడ్డులోని గగ్గితిప్ప వద్దకు మార్చి ఏడాది అవుతోంది. పాత సంత ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌కు గదులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు అమలులో విఫలమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ పరిధిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

➡️