మహిళా కార్మికులకు వసతులు కల్పించాలి

మహిళా కార్మికులు

ప్రజాశక్తి – కాకినాడజిల్లాలో మహిళా కార్మికులు పనిచేసే అన్ని పారిశ్రామిక యూనిట్లలో వాష్‌ రూములు, చైల్డ్‌ ఫీడింగ్‌, చైల్డ్‌కేర్‌ రూములను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కోర్టు హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. సమా వేశంలో ముందుగా సింగిల్‌ డెస్క్‌ విధానంలో పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల ద్వారా అనుమతుల కోరుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన ధరఖాస్తుల పరిష్కార ప్రగతిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గడచిన త్రైమాస కాలంలో జిల్లాలో వివిధ అనుమతుల కొరకు మొత్తం 221 ధరఖాస్తులు రాగా, వీటిలో 188 ధరఖాస్తులను పరిష్కరించారని, 8 ధరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. మహిళలు పని చేస్తున్న పరిశ్రమల్లో వాష్‌ రూములు, చైల్డ్‌ ఫీడింగ్‌, చైల్డ్‌ కేర్‌ రూములు తప్పనిగా ఉండాలన్నారు. అలాగే మహిళా కార్మికుల పట్ల అనుచిత పోకడల నివారణకు అన్ని యూనిట్లలో ప్రత్యేక రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం టి.మురళి, ఏడీ కె.కృష్ణారావు, ఎల్‌డిఎం సిహెచ్‌ ఎస్‌వి.ప్రసాద్‌, డిపిఒ కె.భారతి సౌజన్య, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ డి.రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️