ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్ ః కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వడ్డేశ్వరంలో ఆదివారం ప్రచారం చేపట్టారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల దేశానికి పెనుముప్పు ఏర్పడిందన్నారు. దేశ సంపదనే కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా అమ్మేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సోమవారం విజయవాడలో జరిగే మహా ధరాలో అందరూ పాల్గొనాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు నిలిపివేయడం వలన వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బిజెపి ప్రభుత్వం పూనుకుందని మండిపడ్డారు. రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం కాల రాసిందన్నారు. సరైన ఉపాధి లేక వలస కూలీలుగా వెళ్తున్న కార్మికులకు పని భద్రత లేక, ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించిందని అన్నారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి.పున్నయ్య, వి.రాజు, కె.శౌరి, వి.కోటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.ప్రజాశక్తి – ఫిరంగిపురంమండలంలోని పొనుగుపాడులో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. సిఐటియు మండల కార్యదర్శి ఎస్ఎం వలి మాట్లాడారు. జి.వెంకటేశ్వరరావు ఈదర హరిబాబు ఫణి పాల్గొన్నారు.సిఐటియు ఆధ్వర్యంలో పాటల శిక్షణప్రజాశక్తి-గుంటూరు : సిఐటియు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో పాటల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కళాకారులకు ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు జగన్మోహన్రావు శిక్షణిచ్చారు. పాట ఒక తూటాలాంటిదని, లక్షలాది మందికి చిన్న పాట ద్వారా పెద్ద సందేశం ఇవ్వొచ్చని అన్నారు. ప్రతి శ్రామికుడూ తన రంగంలో వచ్చే సమస్యలను పాట రూపంలో చెప్పగలినప్పుడు ఎంతో ప్రభావం ఉంటుందని, పాటల ద్వారా ప్రజల సమస్యలను పాలకులకు వినిపించవచ్చపి అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ సోమ, మంగళవారాల్లో విజయవాడలో జరిగే మహాధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు.