ప్రజాశక్తి -నెల్లూరు
ఈనెల 27 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహా ధర్నా కార్యక్రమంలో రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె అజరు కుమార్ పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, బ్యాంకు, ఎయిర్ పోర్ట్, స్టీల్ ప్లాంట్ లు, సముద్ర మార్గాలు అన్ని ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొరికిన కాడికి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కార్మికులు ఐక్యమై నవంబర్ 26 27 తేదీల్లో జరిగే మహాధర్నాల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూని యన్ జిల్లా కార్యదర్శి షేక్ రెహనా బేగం, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి గోపాల్ పాల్గొన్నారు.