భూ సమస్యలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

ప్రజాశక్తి-హనుమంతునిపాడు: హనుమంతునిపాడు మండలం పేదల భూములు అన్యాక్రాంతం చేస్తున్న పెత్తందారుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడలోని ఎస్సీ కమిషనర్‌ కార్యాలయంలో కమిషనర్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ను కలిసి సమస్యలు వివరించినట్లు తెలిపారు. మండలంలోని పెద్ది వెంకటాయపల్లి గ్రామంలో సర్వే నెంబర్‌ ఒకటిలో 530 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పట్టాలతో స్థానికేతరులు కాజేశారని పేర్కొన్నారు. వీరి పట్టాలను రద్దుచేసి స్థానిక భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని వారు కోరారు. దాసర్లపల్లి గ్రామంలో గూడూరి కొండయ్యకు చెందిన భూమి సర్వే నెంబరు 99/2లో మూడు ఎకరాల 42 సెంట్లు వారసత్వ హక్కుగా వచ్చిన భూమిని స్థానిక పెత్తందారులు, దళారులు కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించారన్నారు. హాజీపురం గ్రామంలో సర్వే నెంబర్‌ 624/3లో ఎకరా 35 సెంట్లు అసైన్మెంట్‌ భూమిని గాలిమోటు విమలమ్మకు పట్టా ఇవ్వగా ఈ భూమిని కౌలుకు తీసుకొని పట్టా పాస్‌ బుక్కును కౌలుదారు తన పేరుతో మార్చుకొని అమ్ముకున్న విషయంపై లిఖితపూర్వకంగా మూడు ఫిర్యాదులు అందించినట్లు తెలిపారు. స్పందించిన కమిషన్‌ చైర్మన్‌ ఉన్నతాధికారులకు వెంటనే లెటర్‌ పెడతానని, సమగ్ర విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు కొండయ్య, గాలిమోటు ఏసేపు పాల్గొన్నారు.

➡️