భూకబ్జాదారులపై కఠినచర్యలు తీసుకోండి

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: మార్కాపురం శాసనసభ్యుని తమ్ముడు కుందురు కృష్ణమోహన్‌రెడ్డి అండదండలతో మార్కాపురంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నా రని, రూ.కోట్లు విలువైన భూములను కబ్జాలు చేస్తున్నారని బాధితులు ఆర్‌.వెంకటనారాయణ, మందటి కృష్ణారెడ్డి జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబసభ్యులు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్‌పి మలికాగర్గ్‌ను కలిసి భూకబ్జాలను వివరించారు. మార్కాపురంలో భూ అక్రమంగా పాల్పడిన అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కాపురం ప్రాంతంలో రూ.16 కోట్ల విలువైన స్థలం కబ్జా విషయంలో జవ్వాజి వెంకట రంగారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, దొందా నాగరాజు గౌడ్‌ సూత్రధారులని, ఆకుల గాలయ్య అనే నకిలీ వారసుని తీసుకొచ్చి పొలాన్ని నకిలీ దస్త్రావేజులను, దొంగ రిజిస్ట్రే షన్‌ పత్రాలను సష్టించి భూములను ఆక్రమిం చారన్నారు. విఆర్‌ఒ, తహశీల్దార్‌ సంతకాలు, అండగల్‌ ఫోర్జరీ చేశారన్నారు. గత సంవత్సరం జనవరిలో సర్వే చేసినట్లు ఒక్క రోజులోనే మార్కాపురం సర్వేయర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి ఎర్రగొండపాలెంలో రిజిస్ట్రేషన్‌ చేయించడం జరిగిందన్నారు. తమకు జరిగిన అన్యాయంపై మార్కాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నప్పటికీ పోలీసులు స్పందించడం లేదన్నారు. అధికారపార్టీకి చెందిన స్థానిక నేత అండదండల తోనే ఈ భూఆక్రమణలు జరిగాయని బాధితులు వాపోయారు. జరిగిన అన్యాయంపై పోలీసులుకు ఫిర్యాదు చేస్తే తమపైనే తిరిగి కేసులు పెట్టిస్తున్నారన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను, భూములను ఆక్ర మించి.. ప్రధాన భూమిక పోషించిన రంగా రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తేనే ఎన్నో భూ అక్రమాలు బయటకు వస్తాయన్నారు. విఆర్‌ఒ సంతకాలు కూడా ఫోర్జరీ చేయించిన సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఐదు కుటుంబాలకు చెందిన బాధితులు వారు కోల్పోయిన భూముల వివరాలతో సహా జిల్లా ఎస్‌పికి ఆధారాలు అందజేశారు. సిట్‌ అధికారులతో దర్యాప్తు చేయించి భూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

➡️