సత్తెనపల్లి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈనెల 27,28 తేదీలలో విజయవాడలో జరిగే మహా ధర్నాలో కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పల్నాడు భావన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం స్థానిక పుతుంబాక భవన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు పట్టణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి షేక్ సైదులు అధ్యక్షత వహించారు. సిలార్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ అనేక పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం 2014 జీవో తీసుకువచ్చి రద్దు చేసిందని ఈ జీవోను వెంటనే రద్దుచేసి సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంక్షేమ బోర్డులో పొందుపరిచిన 12 రకాల సంక్షేమ పథకాలను కార్మికులకు వెంటనే అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన పెండింగ్ క్లైములను వెంటనే పరిష్కరించి సంబంధిత కార్మికులకు ఆ డబ్బులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ కార్యదర్శి సాల్మన్‌రాజు, కమిటీ సభ్యులు చంద్రయ్య, పెదాల వాసు, పెదాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.